రియాల్టర్‌ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా? 

14 Aug, 2021 07:27 IST|Sakshi
పుట్టినరోజు వేడుకల్లో గురూజీ (తలపాగా ధరించిన వ్యక్తి ఫైల్‌)  

రియల్టర్‌ హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు

గురూజీ కోసం ముమ్మరంగా గాలింపు

కస్టడీ ముగిసిన తర్వాతే పూర్తి వివరాల వెల్లడి: డీసీపీ

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌పీ ప్రాంతానికి చెందిన రియల్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్‌ కర్నూల్‌కు చెందిన మల్లేష్‌, విజయవాడకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్‌ బోరబండకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్‌ అలియాస్‌ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్‌ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది.

కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు