‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్‌

7 Dec, 2023 01:14 IST|Sakshi

యువతి ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన జగదీశ్‌ 

వేధింపులు తట్టుకోలేక యువతి బలవన్మరణం 

పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు జగదీశ్‌ అలియాస్‌ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్‌ ఆరి్టస్టుగా నటిస్తుండేది.

పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్‌ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారు. జగదీశ్‌ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేసేది కాదు. 

రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి 
ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్‌ వద్దకు వచ్చిన జగదీశ్‌.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్‌ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్‌ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు.

దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్‌ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్‌లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్‌ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు