నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!

6 Sep, 2021 11:32 IST|Sakshi

నకిలీ చలాన్ల వ్యవహారంలో ఇప్పటి వరకు రూ.2.72 కోట్లు రికవరీ

జిల్లాలో మొత్తం రూ.5.21 కోట్లు స్వాహా

ఒక్క మండవల్లి దస్తావేజు లేఖరి నుంచే రూ.కోటి రికవరీ

సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ చలాన్ల స్కాంలో స్వాహా చేసిన సొమ్మును వసూలు చేయడంలో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వేగం పెంచారు. జిల్లాలోని గాంధీనగర్, గుణదల, పటమట, జిల్లాలోని కంకిపాడు, మండవల్లి, నందిగామ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు 772 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.5.21 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ కట్టకుండా దస్తావేజు లేఖర్లు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు.

కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఈ ఆరింటిలో ఒక్క మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోనే 581 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.62 కోట్లు ఖజానాకు కన్నం పెట్టినట్టు తేల్చారు. ఇది రాష్ట్రంలో నకిలీ చలాన్ల ద్వారా జరిగిన అవినీతిలోకెల్లా ఇదే అధిక మొత్తం. అంతేకాదు.. ఈ సొమ్మునంతటినీ కాజేసింది అక్కడ ఉన్న బాలాజీ అనే ఒకే ఒక్క దస్తావేజు లేఖరి కావడం గమనార్హం! అలాగే విజయవాడలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 143 దస్తావేజులకు సంబంధించి రూ.1.82 కోట్ల స్వాహా జరిగినట్టు తనిఖీల్లో గుర్తించారు.

బాధ్యులపై చర్యలు.. 
ఈ నకిలీ చలాన్ల వ్యవహారం వెలుగు చూసినప్పట్నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సొమ్ము రికవరీపై దృష్టి సారించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా మండవల్లి, పటమట సబ్‌ రిజిస్ట్రార్లతో పాటు పటమట రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను ఇటీవల సస్పెండ్‌ చేశారు. మండవల్లి దస్తావేజు లేఖరి బాలాజీపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆస్తి యజమాని నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును వసూలు చేసి, తప్పుడు మార్గాల్లో మార్ఫింగ్‌ ద్వారా దస్తావేజు లేఖర్లు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో సంబంధిత యజమానులకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జరిగిన మోసంపై కంగుతిన్న సదరు యజమానులు ఆయా దస్తావేజు లేఖరులపై ఒత్తిడి పెంచడంతో వారు స్వాహా చేసిన సొమ్మును క్రమంగా రికవరీ చేయగలుగుతున్నారు.

ఇలా ఇప్పటిదాకా విజయవాడ గాంధీనగర్, నందిగామ, కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో సంబంధీకుల నుంచి పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చేశారు.  మరోవైపు మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.2.62 కోట్ల సొమ్మును దిగమింగిన దస్తావేజు లేఖరి బాలాజీ నుంచి ఇప్పటి దాకా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశారు. మిగిలిన సొమ్మును త్వరలో రికవరీ చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాలాజీ కుమారుడు రామ్‌ధీరజ్‌ డాక్యుమెంట్‌ వెండర్‌గా ఉన్నాడు. ఆయన కూడా తండ్రి బాటలోనే పయనించాడు. దస్తావేజుల అమ్మకానికి వీలుగా చలాన్ల ద్వారా ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధీరజ్‌ కూడా నకిలీ చలాన్ల ద్వారా రూ.1.53 లక్షలు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ధీరజ్‌ స్వాహా చేసిన రూ.1.53 లక్షలను అధికారులు వసూలు చేశారు.

రూ.2.72 కోట్ల రికవరీ.. 
జిల్లాలో నకిలీ చలాన్ల ద్వారా కొల్లగొట్టిన రూ.5,21,27,931లో ఇప్పటివరకు రూ.2,72,22,719 లను (52.22 శాతం) అధికారులు రికవరీ చేశారు. మిగతా రూ.2,49,05,212 సొమ్ము వసూలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్‌ ‘సాక్షి’కి చెప్పారు.

ఇవీ చదవండి:
టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు 
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు

మరిన్ని వార్తలు