రూ.2,300 లాక్కుని హత్య! 

10 Aug, 2021 03:13 IST|Sakshi
హత్యకు గురైన ఆనంద్‌ (ఫైల్‌)

‘సీతానగరం’ కేసు నిందితుల చేతుల్లో హత్యకు గురైన వ్యక్తి గుర్తింపు 

హతుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఆనంద్‌కుమార్‌ 

జూన్‌ 19న హత్య.. ఇప్పుడు వెలుగులోకి 

బతికుండగానే తీగలు చుట్టి కృష్ణానదిలో పడేసిన దుండగులు 

తాడేపల్లిరూరల్‌: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సీతానగరం అత్యాచారం కేసులో నిందితులు హత్యచేసిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన యడ్లపల్లి ఆనంద్‌కుమార్‌ అని పోలీసులు సోమవారం గుర్తించారు. హత్యచేసినట్లు నిందితులు వెల్లడించడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. మిస్సింగ్‌ కేసుల ఆధారంగా పరిశీలించి హతుడు ఆనంద్‌కుమార్‌ అని నిర్ధారించారు. అత్యాచారం కేసులో కృష్ణ, షేక్‌ హబీబ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో నిందితుడు వెంకటరెడ్డి అలియాస్‌ ప్రసన్నరెడ్డి పరారీలో ఉన్నాడు. ఆనంద్‌కుమార్‌ వద్ద ఉన్న రూ.2,300 లాక్కుని హత్యచేసినట్లు తెలిసింది. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలో ఒకటి ఆనంద్‌కుమార్‌దిగా గుర్తించారు.

ఈ మేరకు సోమవారం చింతలపూడిలో ఉన్న ఆనంద్‌కుమార్‌ భార్య మృదులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ సింగ్‌నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనంద్‌కుమార్‌ రైలులో వేరుశనగకాయలు, శనగలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జూన్‌ 19న తాడేపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ వెంబడి నడుస్తూ కృష్ణానది రైల్వేబ్రిడ్జి వద్దకు వెళ్లేవరకు భార్య మృదులతో ఫోన్‌లో మాట్లాడాడు. గూడ్స్‌ రైలు వెళుతోందని, సరిగా వినిపించడంలేదని, పావుగంటలో ఫోన్‌ చేస్తానని భర్త చెప్పినట్లు మృదుల తెలిపింది. తరువాత ఆమె ఫోన్‌చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. మూడురోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌ చేయకపోవడంతో ఆమె జూన్‌ 22న తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 23న మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  

శనగకాయలు అమ్మిన డబ్బు లాక్కుని.. 
విశ్వసనీయ సమాచారం మేరకు.. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నుంచి విజయవాడ వెళ్లే రైలు మార్గంలో కృష్ణానది రైల్వే బ్రిడ్జిపై కృష్ణ, ప్రసన్నరెడ్డి, షేక్‌ హబీబ్‌ రాగితీగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై నడిచి వెళుతున్న ఆనంద్‌కుమార్‌ను ప్రసన్నరెడ్డి ఆపి ఎవర్రా నువ్వు అంటూ ప్రశ్నించారు. శనగకాయలు అమ్ముకుంటానని, పేరు ఆనంద్‌ అని, ఇంటికి వెళుతున్నాని చెప్పాడు. ఇంతలో కృష్ణ వచ్చి అతడి దగ్గర ఉన్న రూ.2,300 లాక్కుని వెళ్లిపొమ్మన్నాడు. బ్రిడ్జి చివర పోలీసులు ఉంటారని, వాడిని పంపిస్తే ఎలా అంటూ ప్రసన్నరెడ్డి.. ఆనంద్‌పై దాడిచేశాడు. 

వెంటనే ముగ్గురు కలసి అతడిని ఒక ఐరన్‌ రాడ్‌కు రాగితీగలతో కట్టి ప్రాణాలతో ఉండగానే కృష్ణానదిలోకి తోసేశారు. ఆనంద్‌ పిల్లర్‌ మీద పడ్డాడు. అరగంట తరువాత నిందితులు పిల్లర్‌ మీద నుంచి ఆనంద్‌ను నదిలోకి పడేశారు. ఈ సంఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

మరిన్ని వార్తలు