నన్ను చంపడానికి.. అచ్చెన్నాయుడు కుట్ర: ఎమ్మెల్సీ దువ్వాడ

9 Mar, 2022 20:39 IST|Sakshi

టీడీపీ కార్యకర్త వెంకటరావును పావుగా చేసుకున్న అచ్చెన్న

కుట్రకు ఆధారాలు లేకుండా చేయడానికే అతన్ని హత్య చేయించారు

అచ్చెన్నాయుడిపై విచారణ చేస్తే.. వాస్తవాలు బయటపడతాయి

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ కార్యకర్త వెంకటరావును ఆపార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే హత్య చేయించి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాక ముందే.. అతని కుటుంబ సభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే వెంకటరావు ఆత్మహత్యకు తానే కారణమని అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి దువ్వాడ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్నాయుడు ఏడాదిగా తనను చంపేందుకు కుట్ర చేసున్నారన్నారు. తనను చంపడానికి వెంకటరావును అచ్చెన్నాయుడు పావుగా చేసుకున్నారని చెప్పారు.


టీడీపీ సీనియర్‌ కార్యకర్త వెంకటరావు

దాన్ని వెంకటరావు బహిర్గతం చేయడంతో కుట్ర బట్టబయలు అవుతుందని ఆందోళన చెందిన అచ్చెన్నాయుడు ఆయన్ని హత్య చేయించారని ఆరోపించారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు సొంత పంచాయతీ నిమ్మాడలో సర్పంచిగా ఎవరు పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వారిని కింజరాపు సోదరులు హత్య చేయిస్తారని ఆరోపించారు. ఇప్పటికే నిమ్మాడలో ఏడుగురిని హత్య చేయించిన రక్తచరిత్ర అచ్చెన్నాయుడు కుటుంబానికి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన కింజరాపు అప్పన్నకు తాను మద్దతుగా నిలిచి.. నామినేషన్‌ వేయించానని చెప్పారు.
చదవండి: ఈఎస్‌ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేస్తాడట: కొలుసు పార్థసారధి

పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త వెంకటరావు మూడ్రోజుల క్రితం కింజరాపు అప్పన్నకు ఫోన్‌ చేసి.. ‘‘అచ్చెన్నాయుడుకు నువ్వు సమీప బంధువు అవుతావు. అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకు పోటీగా ఎలా నిలబడతావ్‌. దువ్వాడను ఏడాదిలోగా చంపేస్తాం. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారని చెప్పారు (ఇందుకు సంబంధించిన ఆడియోను వినిపించారు). దీనిపై ఆందోళన చెందిన అప్పన్న టెక్కలి పోలీసు స్టేషన్‌లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు.. మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోని వెంకటరావు ఇంటికి వెళ్లారని.. ఆ సమయంలో అతను ఇంట్లో లేరని..  వస్తే టెక్కలి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పాలని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారని శ్రీకాకుళం ఎస్పీ సాయంత్రం ప్రకటించారని వివరించారు. వెంకటరావును పోలీసులు బెదిరించిన దాఖలాలే లేవన్నారు. ఔ

వెంకటరావు ఎవరో తెలియదు..  
పొత్తంగి గ్రామానికి చెందిన వెంకటరావు ఎవరో తనకు తెలియదని దువ్వాడ శ్రీనివాస్‌ చెప్పారు. రెండు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. తనపై 19 కేసులు పెట్టించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు... అందిస్తున్న సుపరిపాలన వల్ల టెక్కలిలో నేను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తన ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు భయపడుతున్నారు. అందుకే ఏడాదిగా నన్ను చంపడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అందుకు వెంకటరావును పావుగా వాడుకున్నాడు. కింజరాపు అప్పన్నను బెదిరించే క్రమంలో వెంకటరావు మాట్లాడిన మాటల ద్వారా నన్ను హత్య చేయడానికి అచ్చెన్నాయుడు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆ కుట్రకు ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటరావును అచ్చెన్నాయుడే హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి..  ఆ నెపాన్ని నాపై వేస్తున్నారు’ అంటూ దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించారు. 

అచ్చెన్నాయుడుపై విచారణ చేయాలి  
వెంకటరావును హత్య చేయించింది అచ్చెన్నాయుడేనని.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీని దువ్వాడ శ్రీనివాస్‌ కోరారు. దర్యాప్తులో అచ్చెన్నాయుడు కుట్ర బట్టబయలు కావడం ఖాయమన్నారు. హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేసే అచ్చెన్నాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.


 కాశీబుగ్గలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌  

 వ్యక్తి బలవన్మరణం 
మందస/ కాశీబుగ్గ: మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కోన వెంకటరావు (38) బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఆఖరకు తన పొలంలోని పంపు  డ్‌ వద్ద వెంకటరావు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వెంటనే పలాస ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కోట వెంకటేష్‌ కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడు టీడీపీ కార్యకర్త కావడంతో ఈ ఆత్మహత్యపై మంగళవారం హైడ్రామా జరిగింది. పోలీసుల వేధింపు వల్లే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉండగా.. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

ఎస్పీ ఏమన్నారంటే.. 
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ విలేకరులతో కాశీబుగ్గలో మాట్లాడారు. వెంకటరావు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని.. రాజకీయాల నేపథ్యంలో పోస్టింగులు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరిపై థ్రెటింగ్‌ పోస్టులు చేసినట్టు వివరించారు. ఈ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ చేసేందుకు పోలీసులు సోమవారం వెంకటరావు ఇంటికి వెళ్లారన్నారు. క్రిమినల్‌ కేసు నమోదు కావడంతో విచారణ కోసం టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు రమ్మని మాత్రమే కోరామని, ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో వెంకటరావు ఇంటిలో కూడా లేరని, ఇచ్ఛాపురంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారని వివరించారు. కేవలం ఒత్తిడితోనే వెంకటరావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని, ఇందులో పోలీసుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. 
చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని

పోలీసులే కారణమంటూ..  
వెంకటరావు మృతదేహం పలాస ఆస్పత్రిలో ఉంచడంతో మంగళవారం టీడీపీ నాయకురాలు గౌతు శిరీష తన అనుచరులతో కలిసి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు బెదిరించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ధర్నా చేశారు.

మరిన్ని వార్తలు