అఖిల ప్రియ అండ.. భార్గవ రామ్‌ దందా!

5 Feb, 2023 04:35 IST|Sakshi
భార్గవరామ్‌ కబ్జా చేసిన స్థలం

ఆళ్లగడ్డలో టీడీపీ నేత భూమా అఖిల, ఆమె భర్త భూ ఆక్రమణలు 

రూ.కోట్ల విలువైన 25 సెంట్ల స్థలం కబ్జా 

బినామీలుగా ఇంటి పని మనుషులు

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండతో ఆమె భర్త భార్గవ రామ్‌ భూ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డలో ఓ మహిళ స్థలాన్ని తమ ఇంట్లో పని చేసే వ్యక్తుల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఆళ్లగడ్డ  మున్సిపాలిటీ చింతకుంటకు చెందిన గూడా నరసింహుడు ఆళ్లగడ్డ శివారులో (కీర్తన స్కూల్‌ పక్కన) ఉన్న అదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ హుస్సేన్, నూర్‌ అహమ్మద్‌ కుటుంబ సభ్యులకు చెందిన 25 సెంట్లు స్థలాన్ని కొని, 1995 మార్చి 27న భార్య గూడా వెంకటలక్ష్మమ్మ పేరు మీద రిజిస్టర్‌ చేయించుకున్నారు.

ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ 1.50 కోట్లు ఉంటుందని అంచనా. స్థలం ఖాళీగా ఉన్న విషయం అఖిలప్రియ దృష్టికి వెళ్లడంతో ఆమె భర్త భార్గవరామ్‌ రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఇక్కడి రెవెన్యూ శాఖలో తిష్ట వేసిన ఓ  అధికారి ఆ స్థలం రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుత యజమాని పేరు రికార్డుల్లో లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా 1952లో అల్లిసా పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌ ఆధారంగా వారి మనువడు నూర్‌బాషాకు వారసత్వంగా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించారు.

1952 నుంచి 1985 వరకు అనేక మార్లు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఈసీలో ఒక్క ఎంట్రీ కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి ద్వారా నూర్‌బాషాతో అఖిలప్రియ ఇంట్లో పనిచేసే నంద్యాల హుస్సేన్‌రెడ్డి పేరు మీద 9 సెంట్లు, అనుచరుడు మిద్దె నాగార్జున పేరు మీద 9 సెంట్లు, బుట్టగాళ్ల రమణ పేరు మీద 7 సెంట్లు 2022 డిసెంబర్‌ 1న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్త­య్యాక ఆ స్థలం కంచె తీసే ప్రయత్నం చేశారు. విష­యం తెలిసిన వెంకటలక్ష్మ­మ్మ, ఆమె భర్త నరసింహులు అధికారులను ఆశ్రయించారు. 

అధికారులు న్యాయం చేయాలి:  బాధితురాలు 
1995లో కొనుక్కుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. కొన్నేళ్లు పొలం సాగు చేసుకున్నాం. చుట్టూ ఇళ్లు పడటంతో మేము కూడా సాగు ఆపేసి కంచె వేసుకున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి తాము కొనుక్కున్నామని బెదిరిస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. కాగా ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నామని సబ్‌ రిజిస్ట్రార్‌ నాయబ్‌ అబ్దుల్‌ సత్తార్‌ తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు