వైఎస్సార్‌సీపీ నేత కుటుంబంపై టీడీపీ వర్గీయుల బాంబు దాడి

25 Jan, 2021 04:59 IST|Sakshi
బాధితురాలిని 108లో తరలిస్తున్న స్థానికులు

కలికిరి (చిత్తూరు జిల్లా): వైఎస్సార్‌సీపీ నేత కుటుంబాన్ని అంతమొందించడానికి టీడీపీ వర్గీయులు నాటు బాంబులతో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఆదివారం జరిగింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రికుంటపల్లి గ్రామం వీర్లపల్లివాండ్లపల్లిలో నివసించే బీసీ వర్గానికి చెందిన మద్దిరాళ్ల మల్లికార్జున తొలి నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. గత రెండు పర్యాయాలు సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. 2011లో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు అప్పట్లో మల్లికార్జున, భార్య నాగవేణి, పిల్లలపై టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం టీడీపీ గ్రామ నాయకులు ఏకంగా బాంబుదాడికి దిగారు.

ఆదివారం ఉదయం పశువులను తీసుకుని మల్లికార్జున, నాగవేణి పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో.. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వాసునూరి శ్రీదేవి, ఆమె భర్త వాసునూరి రెడ్డెయ్య, చిన్నరెడ్డెయ్య, నాగరాజు, రాచయ్య, గుండ్లపల్లి ఈశ్వరయ్య, నాగభూషణయ్య, మణికుమార్, సుమలత, శారదమ్మ తదితరులు వారిపై నాటు బాంబులతో దాడి చేశారు. ఓ బాంబు పేలి నాగవేణికి తీవ్రగాయాలవ్వడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. త్రుటిలో తప్పించుకున్న మల్లికార్జున గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దాడికి వచ్చిన వారు పరారయ్యారు.

నాగవేణిని తొలుత కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లకు బలమైన దెబ్బలు తాకడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపారు. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓ నాటు బాంబును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గత నెల 13న కూడా టీడీపీ నాయకులు తమ కుటుంబంపై దాడి చేశారని, ఈ విషయమై కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశామని మల్లికార్జున చెప్పాడు.  

మరిన్ని వార్తలు