నాలుగు నెలల గర్భిణి.. చెకప్‌ కోసమని వెళ్ళి అక్కడి నుండి అదృశ్యం

21 Nov, 2023 11:24 IST|Sakshi
యాస్మిన్‌

ఆలేరురూరల్‌: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆలేరు పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన యాస్మిన్‌ నాలుగు నెలల గర్భిణి. ఆదివారం సాయంత్రం చెకప్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యాస్మిన్‌ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

దీంతో యాస్మిన్‌ తండ్రి మహమ్మద్‌ లాల్‌బీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపారు. యాస్మిన్‌ తన భర్త గుడుమియాతో కలిసి సిద్దిపేటలో నివాసముంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ... ప్రయాణికులు సురక్షితం
మిర్యాలగూడ టౌన్‌: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు సోమవారం మిర్యాలగూడ మండలం ముల్కలకాలువకు వెళ్తూ ఆలగడప వద్ద రోడ్డు క్రాస్‌ చేస్తుండగా నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది.

బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్‌ పాండు మిర్యాలగూడ డిపో మేనేజర్‌ బొల్లెద్దు పాల్‌కు తెలియజేయగా.. డీఎం ఆదేశాల మేరకు బస్సు డ్రైవర్‌ మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు