నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు

2 Feb, 2024 05:52 IST|Sakshi

ఈజీ మనీ కోసం సీఐడీ పేరిట బెదిరింపులు  

రూ.కోట్లు కొల్లగొట్టేందుకు యత్నం 

హైదరాబాద్‌లో కటకటాల పాలైన మైదుకూరువాసి మహేంద్రకుమార్‌ 

సాక్షి ప్రతినిధి, కడప:  సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్‌ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్‌ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్‌ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్‌ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్‌ (47)తో పరిచయం ఏర్పడింది.

అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్‌ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్‌ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్‌ రేంజ్‌ కార్యాలయంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు.

ఎస్‌ఐ సుజన్‌ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్‌ ఇష్యూస్‌ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. 

రూ.10కోట్లు డిమాండ్‌ 
అమెరికాలోని క్లయింట్‌ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్‌ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు.

ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు.

విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్‌ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు