అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?

2 Sep, 2022 15:01 IST|Sakshi
చరిష్మ, గీత, వెంకట్, (ఫైల్‌)

పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్‌ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి.

అమ్మా.. ఎందుకిలా చేశావు? 
అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? 

వింజమూరు: స్థానిక జైభీమ్‌ నగర్‌లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్‌ నగర్‌కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్‌ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్‌ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్‌ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. 

గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్‌ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది.  


నాన్నా.. నేనేం పాపం చేశాను? 
నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? 

నెల్లూరు(క్రైమ్‌): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్‌ మెసేజ్‌ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్‌ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్‌కుమార్‌ (14), ప్రేమ్‌కుమార్‌ పిల్లలున్నారు. సంజయ్‌ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. 

ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్‌ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్‌ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్‌ ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు