కొనసాగుతున్న ‘గసగసాల’ నిందితుల అరెస్టులు

18 Mar, 2021 04:48 IST|Sakshi
సెబ్‌ పోలీసులు అరెస్ట్‌చేసిన దిమ్మెరి నాగరాజు, రేవణ్‌కుమార్‌

మాదకద్రవ్యాల మాఫియాలో మరో ఇద్దరి అరెస్ట్‌ 

రూ.కోట్ల విలువైన 18.10 కేజీల ఓపీఎం పాపీ సీడ్స్‌ స్వాదీనం 

మదనపల్లె టౌన్‌ (చిత్తూరు జిల్లా): మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాలు (ఓపీఎం పాపీ సీడ్స్‌) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. మాదకద్రవ్యాల మాఫియా ముఠాలో మరో ఇద్దరిని మంగళవారం రాత్రి సెబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మదనపల్లె సెబ్‌ సీఐ కేవీఎస్‌ ఫణీంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె మండలం మాలేపాడు గ్రామం, కత్తివారిపల్లెకు చెందిన బొమ్మిరాసి నాగరాజ(45), పెద్దూరు దళితవాడలో ఉండే అతని మామ అల్లాకుల లక్ష్మన్న (60), బావమరిది అల్లాకుల సోమశేఖర్‌ (26)ను ఆదివారం సెబ్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. నాగరాజ పోలీసుల విచారణలో నోరు విప్పడంతో తీగలాగితే డొంక కదిలినట్లయింది.

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, చౌడేపల్లె తదితర ప్రాంతాల నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాల్లో డ్రగ్‌ మాఫియా నిందితులున్నట్లు తేలడంతో.. చౌడేపల్లె మండలం, కాగితి పంచాయతీ, గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మెరి వెంకటరెడ్డి కుమారుడు దిమ్మెరి వెంకటరమణ అలియాస్‌ గుట్టకిందపల్లె నాగరాజ (53)తో పాటు అదే మండలం, దిగువపల్లె పంచాయతీ, కాయలపల్లెకు చెందిన నాగరాజ కుమారుడు రేవణ్‌కుమార్‌ (31)ను బోయకొండ గంగమ్మగుడి మార్గంలోని ఆర్చి వద్ద మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.

ఈ కేసులో తెరవెనుక సూత్రధారులుగా ఉన్న బెంగళూరు, చెన్నై, ముంబయిలో ఉండే మాఫియా డాన్‌లను పట్టుకోవడానికి పోలీసులు సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ కేసులో ఐవోగా మదనపల్లె సెబ్‌ సీఐ కేవీఎస్‌ ఫణీంద్ర వ్యవహరిస్తున్నారు. ముంబైలో ఉంటున్న బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్‌ భూమ్మను పట్టుకోవడానికి పోలీసులు పావులు కదుపుతున్నారు. గుట్టకిందపల్లె నాగరాజ, బొంబాయి క్రిష్ణమ్మపై మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన కేసులు ఇదివరలోనే చౌడేపల్లె, అనంతపురం, నల్లచెరువు పోలీస్‌ స్టేషన్లలో ఉన్నాయి. వీరిద్దరిని కూడా త్వరలోనే సెబ్‌ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. 

>
మరిన్ని వార్తలు