కంటైనర్‌లో పైన పైపులు.. కింద గంజాయి!

19 Jul, 2021 04:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లారీలో 2 టన్నుల గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరి అరెస్ట్‌

తణుకు: పీవీసీ పైపుల రవాణా మాటున భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 టన్నుల గంజాయిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు, తణుకు సర్కిల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ జయరామరాజు మీడియాకు తెలిపారు.

తణుకు జాతీయ రహదారిపై మహిళా కళాశాల సమీపంలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీవీసీ పైపుల లోడుతో వెళుతున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. పైపుల కింది భాగంలో ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్‌లో మొత్తం 85 సంచుల్లో నిషేధిత గంజాయిని గుర్తించారు. కర్నాటకలోని బీదర్‌ జిల్లా ఫరీదాబాద్‌కి చెందిన లారీ డ్రైవర్‌ రాజప్ప, గుల్బర్గా జిల్లా కుడుమూతికి చెందిన్‌ క్లీనర్‌ ఆనంద్‌లను అరెస్ట్‌ చేశారు. లారీతో పాటు వారి నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు