యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

30 Apr, 2022 11:35 IST|Sakshi

నలుగురు దుర్మరణం.. 

మృతుల్లో ముగ్గురు క్లాస్‌మేట్స్‌..

ఒకరు భవన యజమాని

సాయంత్రం అందరూ కింద కూర్చొని ఉండగా దుర్ఘటన

యాదగిరిగుట్టలో విషాదం

యాదగిరిగుట్ట: ఓ భవనం బాల్కనీ కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు కలసి చదువుకున్న స్నేహితులు కాగా.. మరొకరు ఇంటి యజమాని. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లోని ఆంధ్రా బ్యాంక్‌ పక్కన గుండ్లపల్లి దశరథ గౌడ్‌ (70)కు రెండంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సుంచు శ్రీనివాస్‌ (40) బట్టల దుకాణం, గిరి బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుమారు 6.34గంటల సమయంలో దశరథ, గిరి, సుంచు శ్రీనివాస్‌ చల్ల గాలికి బయట కూర్చున్నారు. ఇదే సమయంలో శ్రీనివాస్‌ స్నేహితులు సుంగి ఉపేందర్‌ (40), తంగళపల్లి శ్రీనాథ్‌ (40) అక్కడికి వచ్చారు. అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా భవనం మొదటి అంతస్తు బాల్కనీ కుప్పకూలి కిందకూర్చున్న వారిపై పడింది. దశరథగౌడ్, శ్రీనివాస్, శ్రీనాథ్, ఉపేందర్‌లు అక్కడికక్కడే మృతి చెం దగా.. గిరికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఉలిక్కిపడిన ‘గుట్ట’వాసులు
బాల్కనీ కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చిం ది. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలోనే కరెంట్‌ పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శిథి లాల కింద ఉన్న ఐదుగుర్నీ గమనించారు. అప్పటికే నలుగురు మరణించగా..తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు జేసీబీ సహాయంతో గంటసేపు తీవ్రంగా శ్రమించారు. 

35 ఏళ్ల కిందటి భవనం..
గుండ్లపల్లి దశరథకు చెందిన ఈ భవనం సుమారు 35 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనానికి మొదట్లో బాల్కనీ లేదు. పదేళ్ల క్రితమే ఏర్పాటు చేయించి, దానిపై పూజ గదిని కూడా నిర్మించారు. అయితే పిల్లర్లు, బీమ్‌లు లేకుండా బాల్కనీ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి 15 నిమిషాల ముందే దశరథ గౌడ్‌ భార్య కౌసల్య అక్కడనుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కౌసల్య రోదిస్తూ తెలిపారు

మరణంలోనూ కలిసే..
శ్రీనివాస్, ఉపేందర్, శ్రీనా«థ్‌లు కలిసి చదువుకున్నారు. స్థానికంగా ఉంటూ ఎప్పుడూ కలసిమెలసి ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చినా కలసి చర్చించుకునే వాళ్లని వారి తోటి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి పరిశీలించారు. సీఐ జానకిరెడ్డి, ఎస్సై సుధాకర్‌రావులు సహాయక చర్యలు పర్యవేక్షించారు. 

గవర్నర్‌ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్టలో భవనం బాల్కనీ కుప్పకూలడంపై గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్ర ఆందోళనకు గురుయ్యానని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుం బానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా లని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. v

మరిన్ని వార్తలు