ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. మరో వ్యక్తితో పరిచయం.. ప్రియుడితో కలిసి భర్తను..

19 Jan, 2022 13:58 IST|Sakshi

Wanaparthy: ఐదు రోజుల్లోనే అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేత సంబంధం కారణంగానే భర్తను భార్యే ప్రియుడితో కలిసి చంపించింది. చివరకు నిందితులిద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి సీఐ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. వనపర్తి మండలం రాజపేట–పెద్దతండా శివారులోని బనిగానితండా చెరువులో ఈనెల 13న తండాకు చెందిన కురుమయ్య అలియాస్‌ కుమార్‌ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు విచారణలో హత్యగా తేల్చారు.

బనిగానితండాకు చెందిన కురుమయ్య, అంజలికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. అనంతరం జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌కు వెళ్లారు. భర్త ఆటో నడుపుకొంటూ ఉండగా.. భార్య ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అలాగే కురుమయ్యకు వరుసకు తమ్ముడైన హరీష్‌ సైతం అక్కడే ఉంటూ ఆటో నడుపుతున్నాడు. రూంలో ఒక్కడే ఉండటంతో అతడిని కురుమయ్య ఇంటికి అప్పుడప్పుడూ రమ్మని పిలిచేవాడు. ఈ క్రమంలోనే హరీష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. అప్పుడే భర్త కురుమయ్యకు డబ్బులు అవసరం ఉండటంతో హరీష్‌ను అడిగాడు.
చదవండి: రాంగ్‌ నంబర్‌ ఫోన్‌కాల్‌తో పరిచయం.. ఘట్‌కేసర్‌లో సహజీవనం..

ఇస్తానులే అని అతను చెప్పడంతో సంక్రాంతి పండుగకు కురుమయ్య, భార్య అంజలి తండాకు వచ్చారు. ఈనెల 13న హైదరాబాద్‌ నుంచి కొత్తకోటకు వచ్చిన హరీష్, తన బామ్మర్దితో కలిసి మద్యంబాటిళ్లు తీసుకుని పెద్దతండా శివారులోని బండ్లచెరువు వద్దకు రమ్మని కురుమయ్యకు ఫోన్‌ చేశారు. వచ్చిన తర్వాత ముగ్గురూ మద్యం తాగారు. హరీష్‌ కర్రతో కురుమయ్య తలపై కొట్టగా బామ్మర్దితో కలిసి గొంతునులిమి చంపారు. అనంతరం వలలో అతడి మృతదేహాన్ని చుట్టి చేపల కోసం వెళితే చనిపోయినట్టు చిత్రీకరించారు. ఇదేమీ ఏమీ తెలియనట్టు 14న హరీశ్‌ బనిగానితండాకు వచ్చాడు.

తన భర్త చెరువులో అనుమానాస్పదంగా చనిపోయినట్టు మరుసటి రోజు భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అందులో హత్యగా తేలడంతో మంగళవారం అంజలి, ప్రియుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 
చదవండి: మసాజ్‌ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు

మరిన్ని వార్తలు