సీఐ హత్య కేసు.. కానిస్టేబుల్‌ దంపతులకు రిమాండ్‌

9 Nov, 2023 17:35 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌శాఖలో సంచలనం సృష్టించిన సీసీఎస్‌ సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ హత్య కేసులో ఇద్దరు నేరుస్తులను పోలీసులు రిమాండ్‌కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాత్రి డీఎస్పీ టి.మహేష్‌ వెల్లడించారు. బోయ జగ దీష్‌, శకుంతల ఇద్దరూ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు. వీరు 2011లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఇద్దరు కుమారులు సంతానం. మొదట భార్యాభర్తలు ఇద్దరు అచ్చంపేటలో పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు.

అయితే సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 2018లో మహబూబ్‌నగర్‌ డీసీఆర్‌బీ సీఐగా ఉన్న సమయంలో శకుంతల మహిళా పోలీస్‌స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ కేసుల వ్యవహారంలో తరచుగా కోర్టు దగ్గర కలవడం, రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం, ఆ తర్వాత సీఐ నిత్యం ఆమెతో వాట్సాప్‌ చాట్‌, మెసేజ్‌లు చేశాడు. అక్కడి నుంచి మరికల్‌ సీఐగా వెళ్లిన తర్వాత కూడా తరచుగా మాట్లాడటం, చాట్‌ చేశాడు. ఈ విషయం భర్త జగదీష్‌కు తెలియడంతో అప్పటి మహబూబ్‌నగర్‌లో ఓ సీఐ దగ్గర కౌన్సెలింగ్‌ ఇప్పించి పేపర్‌ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీఐ మరికల్‌ నుంచి కొడ ంగల్‌కు బదిలీ కావడం, ఆ తర్వాత సస్పెండ్‌ కావడంతో కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు.

దాడి చేసి వార్నింగ్‌ ఇచ్చినా..  తీరు మారలే..
ఇఫ్తికార్‌ అహ్మద్‌ 2022 డిసెంబర్‌ 10న తిరిగి సీసీఎస్‌ సీఐగా మహబూబ్‌నగర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలై.. కొత్త నంబర్స్‌తో చాట్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ భర్త 2023 మార్చి 8న ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌, శకుంతలను ఇలాంటి వ్యవహారం మానుకోవాలని హెచ్చరిండంతో పాటు సీఐపై దాడి చేసి వార్నింగ్‌ సైతం ఇచ్చాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తితో సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీయించాడు. ఆ తర్వాత కూడా సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ తరచుగా ఎంవీఎస్‌ కళాశాల వైపు వెళ్లడం, శకుంతల వెళ్లే సమయంలో వెంట వెళ్లి మాట్లాడటం చేశాడు.

అప్పటికే సీఐ ప్రవర్తనపై నిఘా పెట్టిన కానిస్టేబుల్‌ జగదీష్‌ 11 ఏళ్లుగా వాళ్ల ఇంట్లో పనిచేసే కృష్ణ అనే యువకుడికి సీఐ గురించి మొత్తం వివరాలు చెప్పి అతను ఆ రూట్‌లో తిరిగినా.. ఇంటికి వచ్చినా తనకు చెప్పాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 1న రాత్రికి సీఐ మళ్లీ శకుంతలకు మెసేజ్‌ చేసి మీ ఆయన డ్యూటీలో ఉన్నాడని అతను డ్యూటీలో ఉన్న ఫొటో ఆమెకు పెట్టాడు.

తాను వస్తానని చెప్పి రాత్రి 11.20 ప్రాంతంలో శకుంతల ఇంటికి వెళ్లాడు. సీఐ వచ్చిన విషయం గమనించిన కృష్ణ వెంటనే కానిస్టేబుల్‌ జగదీష్‌కు ఫోన్‌ చేసి సమాచారం చెప్పడంతో నైట్‌ డ్యూటీలో ఉన్న అతను రాత్రి 11.35 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌పై జగదీష్‌తో పాటు కృష్ణ దాడి చేసి మెడ, ముఖంపై తీవ్రంగా కొట్టి సీఐని అతని కారు మధ్య సీటులో వేశాడు. అప్పటికే కృష్ణకు ఇంటి నుంచి దూరంగా ఖాళీ స్థలం ఎక్కడ ఉందో చూసి రావాలని పంపించి ఇతను మళ్లీ రాత్రి 2 గంటల ప్రాంతంలో వన్‌టౌన్‌ చౌరస్తాకు వచ్చి డ్యూటీలో ఉన్నట్లు ఓ ఫొటో దిగి పోలీస్‌స్టేషన్‌ వాట్సాప్‌ పంపాడు.

► ఆ తర్వాత మళ్లీ ఇంటి దగ్గరకు వెళ్లగా అప్పటికే కృష్ణ కారును తీసుకువెళ్లి మర్లు పాలకొండ రూట్‌లో నిలిపాడు. తెల్లవారుజామున 3.36 గంటల ప్రాంతంలో జగదీష్‌ అక్కడికి చేరుకుని ఇఫ్తికార్‌ అహ్మద్‌పై బండరాయితో తలపై దాడి చేయడం, అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో శరీర భాగాలను కట్‌ చేశాడు. ఈ క్రమంలోనే సీఐ మర్మాంగం సైతం కొంత భాగం కట్‌ అయింది.

ఆ తర్వాత కానిస్టేబుల్‌ జగదీష్‌ సీఐ ప్యాంట్‌ తీసి.. అతని చేతులకు ఉన్న రక్తం శుభ్రం చేసి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో జగదీష్‌, కృష్ణ ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో కత్తి అక్కడే ఉన్న మురుగు కాల్వలో పడేశాడు. ఆ తర్వాత జగదీష్‌ ఒంటిపై ఉన్న దుస్తులు, ఇంట్లో రక్తం శుభ్రం చేసిన దుస్తులు తగలబెట్టాడు. అప్పటికే శకుంతల ఇంట్లో పడిన రక్తం నీటితో శుభ్రం చేయడంతో పాటు అక్కడే పడిపోయిన సీఐ టీషర్ట్‌ తీసి ఇంటిపై పారేసింది. ఈ విషయాన్ని శకుంతల ఆమె బంధువుకు ఫోన్‌ చేసి చెప్పగా.. సదరు వ్యక్తి వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలని సూచించడంతో ఆ తర్వాత శకుంతల పోలీసులకు ఫోన్‌ చేసి సీఐని తన భర్త కారులో బైపాస్‌ వైపు తీసుకువెళ్లాడని చెప్పింది.

అప్పటికే తెల్లవారుజామున ఆ రోడ్డుపై వెళ్తున్న వాకర్‌ వంశీ అనే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సీఐని చికిత్స కోసం ఎస్‌వీఎస్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 7న ఉదయం 11.13 గంటలకు మృతి చెందాడని డీఎస్పీ తెలిపారు. మొదట ఎఫ్‌ఐఆర్‌లో 307, 201 సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేశాడమని, సీఐ మృతి చెందిన తర్వాత 302, 201 సెక్షన్స్‌ కింద కేసులు నమోదు చేసి ఏ1 జగదీష్‌, ఏ2 శకుంతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఏ3 కృష్ణ పరారీలో ఉన్నాడని చెప్పారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, హత్య చేయడానికి వాడిన బండరాయి, టీషర్ట్‌, రికవరీ చేసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు