భర్తను చంపినా భార్యకు పెన్షన్‌ ఇవ్వాల్సిందే..

31 Jan, 2021 17:19 IST|Sakshi

చండీగ‌ఢ్‌: ప్రభుత్వోద్యోగి  అయిన భర్తను చంపిన భార్యకు పెన్ష‌న్ ఇవ్వాల్సిందేనని పంజాబ్‌-హ‌ర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వోద్యోగి అయిన భర్తను చంపింద‌ని తేలితే భార్యకు పెన్ష‌న్ ఇచ్చేది లేద‌ని హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్ర‌భుత్వ ఆదేశాలను త‌ప్పుబ‌డుతూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. భ‌ర్త‌ను భార్యే చంపింద‌ని సాక్షాధారాలతో రుజువైనా, భార్యకు ఫ్యామిలీ పెన్ష‌న్ ఇవ్వాల్సిందేన‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగి చ‌నిపోతే, వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఫ్యామిలీ పెన్ష‌న్‌ను ఇస్తారని, అలాంటిది ఎటువంటి ఆర్ధిక భరోసా లేని భార్యకు ఫ్యామిలీ పెన్ష‌న్‌ ఇస్తే తప్పేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భార్య క్రిమిన‌ల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్ష‌న్ పొందేందుకు అర్హురాలేనని కోర్టు స్ప‌ష్టం చేసింది. 

భ‌ర్త‌ను హ‌త్య చేసిన కేసులో దోషిగా తేలిన బ‌ల్జీత్ కౌర్ అనే మ‌హిళ వేసిన పిటిష‌న్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది. హ‌ర్యానా ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన త‌న భ‌ర్త 2008లో మ‌ర‌ణించాడ‌ని ఆమె పిటిష‌న్‌లో పేర్కొంది. అయితే 2009లో ఆమె తన భర్తను హతమార్చిందని పోలీసులు ఆమెపై హ‌త్యానేరం మోపగా, 2011లో ఆమె దోషిగా తేలింది. 2011 వ‌ర‌కూ హ‌ర్యానా ప్ర‌భుత్వం ఆమెకు పెన్ష‌న్ ఇచ్చినా.. ఆత‌ర్వాత దోషిగా తేల‌డంతో ఆమె పెన్షన్‌ను నిలిపి వేసింది. తాజా విచార‌ణ‌లో హ‌ర్యానా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను తప్పు పట్టిన  కోర్టు.. బల్జీత్‌ కౌర్‌కు పూర్తి బ‌కాయిల‌తో పాటు పెన్ష‌న్ చెల్లించాల‌ని సంబంధిత శాఖ‌ను ఆదేశించింది. కాగా, సీసీఎస్‌ రూల్స్‌, 1972 ప్ర‌కారం భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత భార్య‌కు ఫ్యామిలీ పెన్ష‌న్‌ను ఇస్తారు. భ‌ర్త మ‌ర‌ణాంతరం భార్య రెండో పెళ్లి చేసుకున్నా, ఆమె ఫ్యామిలీ పెన్ష‌న్‌కు అర్హురాలే.
 

మరిన్ని వార్తలు