భర్తకు వీడియో కాల్‌ చేసి భార్య ఆత్మహత్య 

2 Sep, 2021 08:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాజేంద్రనగర్‌: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు వీడియో కాల్‌ చేసి భార్య ఉరివేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ ప్రాంతానికి చెందిన సాయిశివ(28), రాజమండ్రికి చెందిన నాగదేవి(24) ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. సాయిశివ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా నాగదేవి బ్యూటీషియన్‌. ఇరువురు హైదర్‌గూడ చైతన్య విలాస్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. 

సాయిశివ వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండి అయిదు రోజులు బెంగళూర్‌లో విధులు నిర్వహించే వాడు. అతడి కుటుంబం ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో నివసిస్తోంది. సోదరి వివాహం ఉండటంతో అతడు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్‌బీనగర్‌లో పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి నాగదేవి వీడియో కాల్‌ చేసి వెంటనే ఇంటికి రావాలని అతడిని కోరింది. వివాహం అనంతరం వస్తానని తెలపడంతో ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియో కాల్‌లోనే ఉరి వేసుకుంటున్నానంటూ నాగదేవి తెలిపింది.

అపార్ట్‌మెంట్‌ పక్కన ఉండే వారికి సాయిశివ ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. వాచ్‌మెన్‌ సాయంతో తలుపులను బద్దలు కొట్టి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న సాయిశివ రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్‌
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి 

మరిన్ని వార్తలు