భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..

25 Dec, 2022 07:58 IST|Sakshi

సాక్షి, గద్వాల క్రైం: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని భార్య భావించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడిని రప్పించి అనుకున్న పనిని చాకచక్యంగా అమలు చేసి వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించారు. ఇక నేరం చేసి తప్పించుకోవాలని వేసిన ఎత్తుగడ మాత్రం ఫలించలేదు. శనివారం డీఎస్పీ రంగస్వామి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

పెబ్బేర్‌ మండలం బూడిదపాడుకు చెందిన ఎండీ అబ్దుల్లా (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల కిందట వివాహైంది. వివాహ అనంతరం గద్వాలలోనే కూలీ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోవడం మానేశాడు. తరుచూ ఇద్దరి మధ్య గొడవలు అవుతుండడంతో, భర్త కూలీ పనులు మాని ఇంటి వద్దే సొంతంగా కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపార సమయంలో భార్య ఎవరితోనైనా చనువుగా మాట్లాడిన ఆమెపై అనుమానంతో తీవ్రంగా అవమానపరిచేవాడు. అయితే మార్కెట్‌ నుంచి ఆటోలో రోజూ కూరగాయాలు తీసుకువచ్చే డ్రైవర్‌ రఫీతో ఆరు నెలలుగా పరిచయం ఏర్పడింది. విషయం గుర్తించిన భర్త ఆమెను మందలించాడు.

ఎలాగైన భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం వేశారు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో అబ్దుల్లా ఒంటరిగా నిద్రిస్తుండగా, భార్య గమనించి ప్రియుడు రఫికి ఫోన్‌ చేసి ఇంటికి రావాలని తెలిపింది. రాఘవేంద్రకాలనీలో ఉన్న వ్యక్తి బైక్‌పై నల్లకుంట కాలనీకి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంతలోనే భార్య ఇంటి తలుపులను మూస్తుండగా, తలుపులు ఎందుకు వేస్తున్నావంటూ భర్త ప్రశ్నించేలోపే భార్య రెండు కాళ్లు లాగి కిందకు పడేసింది. అక్కడే ఉన్న ప్రియుడు చున్నీతో గొంతుకు బలంగా బిగించి, మర్మాంగాలపై కొట్టారు. దీంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు.  

బంధువుల ఫిర్యాదుతో..  
ఎవరికీ అనుమానం రాకుండా రఫీని ఇంటి నుంచి బయటకు పంపింది. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో భర్త బంధువు వరుసకు సోదరుడు హాజీకి ఫోన్‌ చేసి అబ్దుల్లాకు ఫిట్స్‌ వచ్చి చనిపోయినట్లు ఫోన్‌ చేసి భార్య చెప్పింది. శుక్రవారం బంధువులు వచ్చి చూడగా గొంతుపై కమిలి ఉండడం, ఛాతీ, ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.

సీఐ చంద్రశేఖర్, పట్టణ ఎస్‌ఐ అబ్దుల్‌ షుకూర్‌ అక్కడికి చేరుకుని ఇంటి చుట్టు పక్కల వారిని ఆరాతీశారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, బైక్, చున్నీ స్వా«దీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు