భర్తతో విడిపోయి.. వంశీతో సహజీవనం.. చివరకు అతడి చేతిలోనే..

16 Jun, 2022 10:27 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నెల్లూరు(క్రైమ్‌): సహజీవనం చేస్తున్న యువకుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గొంతు నులిమి.. నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన 14వ తేదీ అర్ధరాత్రి నెల్లూరులోని భగత్‌సింగ్‌కాలనీ టిడ్కో ఇళ్లలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.

దర్గామిట్ట రామ్‌నగర్‌కు చెందిన రమణ (31), వెంకటరమణలు దంపతులు. వారికి ఒక కుమారుడున్నాడు. విభేదాల నేపథ్యంలో భార్యాభర్తలు విడిపోయారు. రమణ తన కుమారుడిని ఇందుకూరుపేటలోని డానియేల్‌ ఫౌండేషన్‌ వసతిగృహంలో చేర్పించి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈక్రమంలో ఆమెకు చిల్లకూరు మండలం మిక్చర్‌ కాలనీకి చెందిన వీడీ వంశీతో రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు.

చదవండి: (భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...)

కొంతకాలం కరెంటాఫీసు సెంటర్‌ గాయత్రినగర్‌లో సహజీవనం చేశారు. రెండునెలల క్రితం భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో అపార్ట్‌మెంట్‌ జీ–4 బ్లాక్‌కు నివాసం మార్చారు. వంశీ కొంతకాలంగా రమణపై అనుమానం పెంచుకోవడంతోపాటు చీటికి మాటికి గొడవపడుతుండేవాడు. ఇటీవల నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న రమణ సోదరి గంగ తన కుమార్తెతో కలిసి వారి వద్దకు వచ్చింది. 14వ తేదీ అర్ధరాత్రి అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌పైన నిద్రించేందుకు వెళ్లారు.

ఈక్రమంలో వంశీ రమణతో గొడవపడ్డాడు. ఆమె గొంతు నులిమి అపార్ట్‌మెంట్‌ పైనుంచి కిందకు తోసేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని గమనించిన గంగ, ఆమె కుమార్తె నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వంశీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు