ఏమైంది తల్లీ...

3 Jan, 2021 09:35 IST|Sakshi

కుమారుడితో సహా వైద్యురాలి బలవన్మరణం

నిద్రమాత్రలు ఇచ్చి తనువు చాలించిన వైనం

అందరికీ ప్రాణం పోసే తల్లివి నీవు.. ఏమైందమ్మా.. నవమాసాలు మోసి కన్న బిడ్డనే కాదనుకున్నావు.. ఆ బిడ్డతో నీవూ అనంత లోకాలకు వెళ్లిపోయావు.. ప్రాణం పోయే వారికీ మందులిచ్చి దేవుడిలా ఆదుకునే నువ్వే ఎందుకిలా చేశావో.. అంత కష్టం ఏమొచ్చిందో.. ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావంటూ ఆ తల్లీబిడ్డల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఓ వైద్యురాలు తన కుమారుడితో సహా బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.  వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం
నెలకొంది.  ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలహాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.. చివరికి ఆత్మహత్యకు పురిగొల్పాయి.. ఈ నేపథ్యంలో తన కుమారుడితో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దేవీచౌక్‌ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్‌ దొంతంశెట్టి లావణ్య (33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్‌ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. (చదవండి: అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!)

ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్‌ (7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లీ బిడ్డలకు అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే హత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు