తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు

11 Jun, 2022 08:09 IST|Sakshi

తన ప్రాణాలకు ముప్పుందని గతంలోనే ఫిర్యాదు

వైఎస్‌ సునీత, ఆమె భర్త, బంధువులపైనే ఆరోపణ

సీబీఐ అధికారి రాంసింగ్‌ వేధిస్తున్నారని ఫిర్యాదు

టీడీపీ హయాంలో సిట్‌ అధికారి చిత్రహింసలు పెట్టారని వెల్లడి

ఎంత ఒత్తిడి చేసినా తప్పుడు వాంగ్మూలం ఇవ్వని గంగాధర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్‌ వివేకా అల్లుడు, కుమార్తె తనను వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణభయం కూడా ఉందని పోలీసులను, న్యాయస్థానాన్ని వేడుకున్న కల్లూరి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటే ఎవరి మీద సందేహం కలగాలి? ఆయన అంతకుముందు ఫిర్యాదులో పేర్కొన్న వారిపైనే కదా? టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
చదవండి: ఈ పాపం బాబుది కాదా?

రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దీన్ని సాధనంగా వాడుకునే కుట్రకు బరి తెగించాయి. గంగాధరరెడ్డి గురువారం అనంతపురం జిల్లా యాడికిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తనకు ప్రాణభయం పొంచి ఉందని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయని గతంలో గంగాధరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వారి కుట్రకు గంగాధరే అడ్డంకి..
వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుట్రలను సమర్థంగా అడ్డుకుంది గంగాధర్‌రెడ్డి అని పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో చంద్రబాబు సర్కారు, అనంతరం సీబీఐ అధికారులు, వివేకా కుమార్తె, అల్లుడు ఎంత వేధించినా గంగాధరరెడ్డి ఒప్పుకోకపోవడంతో వారి ఎత్తుగడలు ఫలించలేదు. అతడు జీవించి ఉండటం వారికి ప్రతికూలంగా  పరిణమించే అంశం అన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతి వెనుక వారి పాత్ర ఉండొచ్చన్న వాదనకు బలం చేకూరుతోంది.

ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు
టీడీపీ అధికారంలో ఉండగా 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. అందులో భాగంగానే నాడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)  విచారణ సాగింది. సిట్‌ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్‌ విచారణ పేరిట గంగాధర్‌రెడ్డిని వేధించారు. వివేకా హత్యకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు ఒప్పుకోవాలని గంగాధరరెడ్డిని వేధించారు. చిత్రహింసలకు గురి చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు.

రాంసింగ్‌ వేధింపులు
అనంతరం సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అదే కుట్ర కొనసాగడం గమనార్హం. సీబీఐ అధికారి రాంసింగ్‌ 2021 అక్టోబరు 3, 4వ తేదీల్లో గంగాధర్‌రెడ్డికి వాట్సాప్‌ కాల్‌ చేసి వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా యాడికిలో ఉన్న గంగాధర్‌రెడ్డి నివాసానికి వెళ్లి అదే రీతిలో ఒత్తిడి తెచ్చారు. విచారణ పేరిట 2021 అక్టోబరు 4న కడప తీసుకొచ్చారు.

వివేకా ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఆయన నిద్రలేవడంతో హత్య చేసినట్లు అంగీకరించాలని శివశంకర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని, అలా చెబితే రూ.10 కోట్లు ఇస్తామన్నారని వాంగ్మూలం ఇవ్వాలని రాంసింగ్‌ ఒత్తిడి చేశారు.  సీబీఐ అధికారులే ఓ వాంగ్మూలం రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలని, న్యాయస్థానంలో అదే విషయం చెప్పాలని వేధించారు. కానీ తనకు తెలియని విషయాలను తెలిసినట్లు చెప్పనని గంగాధర్‌రెడ్డి స్పష్టం చేశాడు. ఆ విషయంపై సీబీఐ అధికారులతో ఘర్షణకు పడ్డారు. తాము అనుకున్నట్లు గంగాధర్‌రెడ్డి సాక్ష్యం ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సైతం నివేదించడం గమనార్హం.

వివేకా కుమార్తె, అల్లుడి బెదిరింపులు..
మరోవైపు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా గంగాధర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సమీప బంధువులైన నర్రెడ్డి జగదీశ్వరరెడ్డి,  భువనాల బాబురెడ్డి యాడికి వెళ్లి గంగాధర్‌రెడ్డిని కలిశారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలే వైఎస్‌ వివేకాను హత్య చేయించినట్లు చెబితే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు కిడ్నీ చికిత్సకు వైద్య ఖర్చులు కూడా భరిస్తామన్నారు. రూ.15 వేలు అడ్వాన్సు కూడా ఇచ్చారు. వారి బెదిరింపులు భరించలేక గంగాధర్‌రెడ్డి 2021 నవంబరు 25న పులివెందుల రింగ్‌ రోడ్డు వద్ద వైఎస్‌ సునీతను కలిశారు. సీబీఐ అధికారులు సూచించినట్లుగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఆమె చెప్పారు. అయితే అందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించాడు.

పోలీసులకు ఫిర్యాదు... కోర్టులో కేసు
తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి తిరస్కరించడంతో ఆయనకు బెదిరింపులు తీవ్రమయ్యాయి. నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డితోపాటు గుర్తు తెలియని ఫోన్‌ నంబర్ల నుంచి పలు బెదిరింపు కాల్స్‌ రావడంతో అనంతపురం పోలీసులకు 2021 నవంబరు 29న ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అప్పటికీ బెదిరింపు కాల్స్‌ ఆగకపోవడంతో తాడిపత్రి న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా దాఖలు చేశాడు. వైఎస్‌ సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, భువనాల బాబురెడ్డిల నుంచి తనకు ప్రాణ హాని ఉందని... సీబీఐ అధికారులు వేధిస్తున్నారని... గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే గంగాధరరెడ్డి తీవ్ర అనారోగ్యం బారిన పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో వెల్లడిస్తూ గంగాధరరెడ్డి పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారో అనుమానాస్పద మృతి వెనుక కూడా వారి ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

తమ కుట్రకు అడ్డంకి అనే తప్పించారా?
వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు గంగాధర్‌రెడ్డి సహకరించకపోవడం ‘కొందరికి’ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు గంగాధర్‌రెడ్డి సమ్మతించకపోవడంతో వారి కుట్ర ముందుకు సాగలేదు. దీంతో గంగాధర్‌రెడ్డిని అడ్డు తప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బెదిరింపులకు లొంగకుండా, తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండా గంగాధరరెడ్డి నిలబడటం కచ్చితంగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అనుకూల అంశం. కాబట్టి వారు గంగాధర్‌రెడ్డి క్షేమాన్ని కోరుకుంటారు. తమ కుట్రకు గంగాధరరెడ్డి సహకరించ లేదని భావిస్తున్న వారే అతడిని అడ్డు తొలగించా లని ప్రయత్నిస్తారు. దీన్నిబట్టి గంగాధర్‌రెడ్డి తనకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారు వివేకా కుమార్తె, ఆమె భర్తకు సమీప బంధువులు కావడం గమనార్హం.

బాబు.. బెంబేలు
శవ రాజకీయాలపై పేటెంట్‌ హక్కులున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. గంగాధర్‌రెడ్డి అనుమానస్పద మృతిపై ఆయన స్పందన మరిన్ని సందేహాలకు తావిస్తోంది. టీడీపీ సర్కారు హయాంలో వేధింపులపై ఫిర్యాదు చేసిన గంగాధర్‌రెడ్డి మృతి చెందడంతో ఆందోళనకు గురైన చంద్రబాబు, లోకేశ్‌ దీనికి రాజకీయ రంగు పులిమేందుకు అవాస్తవ ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. గంగాధర్‌రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తు కోరితే తమ బండారం బట్టబయలవుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు