ఇలా ప్రిపేరయితే మీరే విజేతలు

19 Nov, 2023 01:32 IST|Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యాన గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ పరీక్షలపై కాకినాడ దంటు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. దీనికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో సదస్సు ద్వారా వారు తెలుసుకున్నారు. హైదరాబాద్‌ సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌, సివిల్స్‌ విజేత బాలలత విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతి విద్యార్థీ ఒత్తిడికి గురి కాకుండా పోటీ పరీక్షకు హాజరవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. చిన్నప్పుడే పోలియో కారణంగా తన కాళ్లకు సమస్య వచ్చిందని, పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రైవేటుగా చదివి పాసయ్యానని చెప్పారు. దూరవిద్యలో బీఏ చదివానన్నారు. హైదరాబాద్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. ఆ కసితోనే 2004 సివిల్స్‌లో ఆలిండియా 399వ ర్యాంక్‌ సాధించానని చెప్పారు. 2016లో 167వ ర్యాంక్‌ వచ్చిందని తెలిపారు. సివిల్స్‌ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందించడం శుభపరిణామమన్నారు. జెడ్పీ సీఈఓ అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఫ్యాకల్టీలు మనోజ్‌కుమార్‌, ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి ఎల్‌.శ్రీనివాసరావు, యాడ్స్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ‘సాక్షి( సిబ్బంది పాల్గొన్న ఈ సదస్సులో బాలలత కొన్ని సూచనలు చేశారు.

ఆమె సూచనలివీ..

● భారీ మెటీరియల్‌ పెట్టుకోకుండా సిలబస్‌పై ఆలోచించి పరీక్షకు ప్రిపరేషన్‌ రూపొందించుకోవాలి.

● మోడల్‌ పరీక్ష ప్రాక్టీస్‌ బాగుంటే నెగిటివ్‌ మార్కులకు ఆస్కారం ఉండదు.

● కష్టమైన సబ్జెక్టును ముందుగా తీసుకుని ఎక్కువ సమయం కేటాయించాలి.

● సబ్జెక్టుల ప్రశ్నల స్థాయి ఏటేటా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా దృక్పథాన్ని మార్చుకుని ప్రణాళికలు వేసుకోవాలి. కష్టమనిపించే టాపిక్‌ అర్థం కావాలంటే మైండ్‌ మ్యాప్‌ వేసుకుని కఽథనం రూపంలో మార్చుకోవాలి.

● ఏ టాపిక్‌ ౖపైనెనా సొంత నోట్స్‌ రాసుకుని సంక్షిప్తత పాటించాలి.

‘సాక్షి’ మీడియా గ్రూప్‌

ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

గ్రూప్‌–1, గ్రూప్‌–2 సన్నద్ధత

సదస్సుకు మంచి స్పందన

పోటీ పరీక్షలపై విద్యార్థులకు

సివిల్స్‌ విజేత బాలలత సూచనలు

మరిన్ని వార్తలు