ఘనంగా ధర్మపథం

1 Dec, 2023 03:22 IST|Sakshi
స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఆత్రేయపురం: కోనసీమలో ప్రసిద్ది చెందిన అయినవిల్లి వినాయకుని అభిషేకం, హోమం, వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం కన్నుల పండువగా జరిగాయి. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మంటపంలో ఈ కార్యక్రమాలు సాగాయి. అయినవిల్లి వినాయక స్వామి, వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం సంయుక్తంగా నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా వినాయకునికి విశేషంగా అభిషేకం, గణపతి అష్ట ద్రవ్య హోమం, పూర్ణాహుతి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. తొలుత స్వామివార్లను ఆత్రేయపురం కాలువ రేవు నుంచి భారీ ఊరేగింపుగా బాణసంచా నడుమ, బ్యాండ్‌ మేళాలతో మంటపానికి తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ , ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. నియోజక వర్గంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నుంచి 44 ఆలయాలకు రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేయించారన్నారు. మరో 40 దేవాలయాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సీజీఎఫ్‌ నుంచి నిధులు మంజూరు చేయించి గోపాలపురంలోశివాలయం , విష్ణు ఆలయాలు, పులిదిండిలో వేణుగోపాలస్వామి, చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో చెరువులను పార్కులుగా అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఆత్రేయపురం చెరువును కూడా పార్కుగా అభివృద్ధి చేసి అల్లూరి సీతారామరాజు పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.

అయినవిల్లి వినాయకునికి అభిషేకం,

వాడపల్లి వెంకన్నకు కల్యాణం

మరిన్ని వార్తలు