వెలుగుపూలు విరబూయాలి

12 Nov, 2023 02:54 IST|Sakshi
బాణసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఔట్‌పోస్ట్‌

దీపావళి వేడుకలకు సర్వం సిద్ధం

అప్రమత్తంగా పోలీసు, ఫైర్‌, రెవెన్యూ శాఖలు

జిల్లావ్యాప్తంగా 452 దుకాణాలకు

అనుమతి

బాణసంచా షాపుల వద్ద

అగ్నిమాపక శాఖ ప్రత్యేక ఔట్‌ పోస్టులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చీకట్లు చీల్చుకుంటూ వెలుగు పూలు విరబూసే పండగ.. దీపావళి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు పండగ సందడితో ఇళ్లు కళకళలాడుతూంటే.. మరోవైపు టపాసుల విక్రయాల హడావుడి మొదలైపోయింది. ఆరుబయట పెద్ద దుకాణాలు, సందుగొందుల్లో చిల్లర కొట్లు కంటికి పట్టని కాంతుల్ని నింపుతున్నాయి. అయితే, ఈ వెలుగుల పండగలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా విషాదాల చీకట్లు అలముకుంటాయనే అనుభవాలు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఈ పండగకు ఆది నుంచి ముగిసే వరకూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. దీంతో అగ్నిమాపక శాఖ కీలకంగా వ్యవహరిస్తూండగా.. అనుబంధంగా పోలీసు, రెవెన్యూ శాఖలు దీపావళి దుకాణాల కేటాయింపు నుంచి ప్రజల్లో అవగాహన, విక్రయాలు, తయారీ కేంద్రాల వద్ద భద్రత తదితర అంశాలపై దృష్టి పెట్టాయి. తద్వారా దీపావళిని దేదీప్యమానంగా చేసుకునేందుకు బాటలు వేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం నాలుగు ఫైర్‌ స్టేషన్ల పరిధిలో 452 బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చారు. దీపావళి వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. రెండు రోజులుగా బాణసంచా దుకాణాల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు, బాణసంచా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. జనం రద్దీని అనుసరించి మందుగుండు దుకాణాల వద్ద ఫైర్‌ ఇంజిన్లు, ప్రతి దుకాణం వద్ద ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు ఏర్పాటు చేశారు. పెద్ద దుకాణాల సముదాయాల వద్ద ఇద్దరు ఫైర్‌మన్‌లతో ఒక ఔట్‌ పోస్ట్‌ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. వీరు బాణసంచా దుకాణాల వద్ద, సమీప ప్రాంతాల్లో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తారు.

జాగ్రత్తలు పాటించాలి

బాణసంచా కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు, కళ్లజోడు, చెప్పులు ధరించడం తప్పనిసరి. భవనాల పై అంతస్తుల్లో టపాసులు కాల్చకూడదు. ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలి. భారీ శబ్దాలు, పొగ వచ్చే బాణసంచా కాల్చకూడదు. పేలని, కాలని బాణసంచా జోలికి వెళ్లవద్దు. కొంత సమయం తర్వాత నీరు లేదా ఇసుక వేసి దూరం జరపాలి. అలర్జీ, ఉబ్బసం, శ్వాసకోస, చర్మసంబంధ, మానసిక, హృద్రోగ సమస్యల బాధితులు బాణసంచా వల్ల వెలువడే పొగ, శబ్దాలకు దూరంగా ఉండాలి. పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. కర్టెన్లు, మండే గుణం ఉన్న ఇతర వస్తువులకు దూరంగా దీపాలు ఉంచాలి. గడ్డివాములు, గుడిసెలు, పెట్రోలు బంకుల సమీపాన, గదుల్లో, డాబా మెట్లు, ఇరుకు ప్రాంతాల్లో మందుగుండు కాల్చడం ప్రమాదకరం.

– మార్టిన్‌ లూథర్‌కింగ్‌, జిల్లా అగ్నిమాపక అధికారి

ఎక్కడెక్కడ ఎన్ని దుకాణాలంటే..

రాజమహేంద్రవరం 266

కొవ్వూరు 56

నిడదవోలు 82

అనపర్తి 48

అత్యవసర సమయంలో సహాయానికి..

దీపావళి వేళ అనూహ్య రీతిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా ప్రజలు వారు నివసించే ప్రాంతాలు ఏ ఫైర్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందనే కనీస అవగాహన కలిగి ఉండాలి. అత్యవసర సమయంలో సహాయానికి 101 ఫైర్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ సహా ఆయా స్టేషన్ల పరిధిలో ఎమర్జెన్సీ నంబర్లను ఆ శాఖ అందుబాటులోకి తెచ్చింది. అవి ఇవే..

రాజమహేంద్రవరం ఇన్నీసుపేట 0883–244101

ఆర్యాపురం 0883–2445101

కొవ్వూరు 08813–231101

నిడదవోలు 08813–221101

అనపర్తి 08857–227201

103 మంది బైండోవర్‌

దీపావళి పండగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా, దుకాణదారులు పూర్తి భద్రతతో వ్యవహరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. 103 మందిని బైండోవర్‌ చేశాం. ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశాం. ఎవరైనా అనధికారంగా, ప్రమాదకరంగా బాణసంచా సామగ్రి విక్రయిస్తూంటే వెంటనే సమాచారం ఇవ్వండి. ఇది కొందరి ప్రాణాలను నిలబెట్టడమే కాదు.. ఎటువంటి నష్టాలూ జరగకుండా కాపాడుతుంది. – పి.జగదీష్‌, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు