నీటి ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారులు..

22 Dec, 2023 09:10 IST|Sakshi
జస్వంత్‌ (ఫైల్‌)

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు

నీటి ట్యాంకులో పడి దుర్మరణం!

కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్నా కానీ ఇలా..

చిన్నారులిద్దరూ విగతజీవులై ట్యాంకులో తేలుతూ..

తూర్పుగోదావరి: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు నీటి ట్యాంకులో పడి దుర్మరణం చెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనలో గట్టిం వినిత (4), కమ్మిల జస్వంత్‌ (4) మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన గట్టిం శ్రీనివాస్‌, దేవి దంపతులు, కమ్మిల రాము, గణేశ్వరి దంపతులు పక్కపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్నారు.

శ్రీనివాస్‌ దంపతులకు వినిత పెద్ద కుమార్తె. ఆమె తరువాత ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాము దంపతులకు జస్వంత్‌తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వినిత, జస్వంత్‌ నర్సరీ చదువుతున్నారు. కాన్వెంట్‌కు వెళ్లి వచ్చిన తరువాత వీరిద్దరూ సాయంత్రం వినిత్‌ ఇంటి పైన ఉన్న వాటర్‌ ట్యాంకుకు ఉన్న నిచ్చెన ఎక్కి, ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయారు. పిల్లలిద్దరూ చాలాసేపు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వారి కోసం వెతికారు. చివరకు వాటర్‌ ట్యాంకులో చూడగా చిన్నారులిద్దరూ విగతజీవులై ట్యాంకులో తేలుతూ కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే పిల్లల జీవితం విషాదాంతం కావడంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి వినిత తండ్రి శ్రీనివాస్‌ వాటర్‌ ట్రాక్టర్లపై ట్యాంకర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఇంటి వాటర్‌ ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిచ్చెనే పిల్లల ఉసురు తీస్తుందనుకోలేదంటూ అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరో మృతుడు జస్వంత్‌ తండ్రి రాము వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్నామని, ఇంతలోనే తమ బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని వారు రోదిస్తున్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి

>
మరిన్ని వార్తలు