సృజనకు దోహదం వైజ్ఞానిక ప్రదర్శనలు | Sakshi
Sakshi News home page

సృజనకు దోహదం వైజ్ఞానిక ప్రదర్శనలు

Published Fri, Dec 22 2023 2:22 AM

ప్రదర్శనలో ప్రాజెక్టులను తిలకిస్తున్న కలెక్టర్‌ మాధవీలత - Sakshi

కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత

ముగిసిన జిల్లాస్థాయి ప్రదర్శనలు

రాష్ట్ర స్థాయి పోటీలకు

తొమ్మిది ప్రాజెక్టులు ఎంపిక

రాజమహేంద్రవరం రూరల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి వారి ఆలోచనలు సమాజ హితానికి తోడ్పడేందుకు విద్యా–వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహద పడతాయని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో రెండో రోజు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా–వైజ్ఞానిక ప్రదర్శనను ఆమె అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభకు పదును పెట్టేందుకు ఈ ప్రదర్శన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల సైన్స్‌, గణిత ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యం చేసి నూతన ప్రాజెక్టులను రూపొందించే విధంగా ప్రోత్సహించడం మంచి కార్యక్రమంగా పేర్కొన్నారు. జిల్లాలో 19 మండలాల నుంచి జిల్లా స్థాయికి ఎంపికై న 57 ప్రాజెక్టులు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల నుంచి 20 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. జిల్లాలో 500 పైగా ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలు ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్ధులను అభినందించారు.

ముగిసిన ప్రదర్శన

రెండు రోజులుగా శ్రీ సత్య సాయి గురుకులంలో జరుగుతున్న జిల్లా స్థాయి విద్యా–వైజ్ఞానిక ప్రదర్శన గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా విద్యా శాఖాధికారి ఎస్‌.అబ్రహం మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. సైన్స్‌ ఉపాధ్యాయులు మారుతున్న బోధనా పద్ధతులు, విధానాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారిని ఆ దిశ గా పోటీలకు సిద్ధపరచాలన్నారు. చక్కని వేదిక ఇచ్చిన శ్రీ సత్యసాయి గురుకులం యాజమాన్యానికి విద్యా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియచేశారు. శ్రీ సత్య సాయి గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన ‘అమ్మ’ లఘు నాటిక ఆహూతులను అలరించింది. దర్శకురాలు శ్రీదేవిని డిఈఓ ప్రత్యేకంగా అభినందించారు. నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీలు అన్నీ సమర్ధవంతంగా తమ విధులు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డివిజన్‌ ఉప విద్యా శాఖాధికారి ఈవీబీఎన్‌ నారాయణ, రూరల్‌ ఎంఈవో ఎ.దుర్గా తులసీదాస్‌, అర్బన్‌ రేంజ్‌ డీఐ బి.దిలీప్‌ కుమార్‌, శ్రీ సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్‌ శ్యాం సుందర్‌, ప్రిన్సిపాల్‌ గురయ్య, కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, రమణ రావు, మంగిన రామారావు, రామానుజం, హరికృష్ణ, జాన్సన్‌, కె.రాజు, వ్యాయామోపాధ్యాయులు ప్రసాద్‌, దొర తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి తొమ్మిది ప్రాజెక్టులు

విద్యా–వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న 57 ప్రాజెక్టుల నుంచి రాష్ట్ర స్థాయికి వ్యక్తిగతంగా ముగ్గురు, గ్రూపులో ముగ్గురు, ఉపాధ్యాయ ప్రాజెక్టులు మూడు మొత్తం 9 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీరు ఈ నెల 28న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారన్నారు.

వ్యక్తిగత విభాగంలో విజేతలు..

కేఎల్‌ఎస్‌ చైతన్య (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పందలపాక), ఎమ్‌.వికాస్‌ (జెడ్పీ ఉన్నత పాఠశాల, నరేంద్రపురం),

ఎస్‌.అనూష (డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఏపీ గురుకులం, గోపాలపురం).

గ్రూప్‌ ప్రాజెక్ట్‌లో..

రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ లాలా చెరువు ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.హరిప్రసాద్‌, ఎస్‌.ఆనంద్‌ కుమార్‌ తయారు చేసిన బ్లైండ్‌ సెన్సార్‌ గ్లాసెస్‌ అనే ప్రాజెక్టు.

రంగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు టీవీఎస్‌ ప్రసన్న, ఈ.భాను మల్లీశ్వరి తయారుచేసిన బయోమెట్రిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ ప్రాజెక్టు.

రఘుదేవపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.ఆదిత్య వర్మ, ఎస్‌.దుర్గాప్రసాద్‌ తయారు చేసిన ప్రమాద నివారణ కార్‌ ప్రాజెక్టు.

ఉపాధ్యాయ విభాగంలో..

ఉండ్రాజవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయులు తయారు చేసిన ‘స్పీచ్‌ రికగ్నిషన్‌ టూల్‌‘ ప్రాజెక్టు.

మద్దూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు కేఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రదర్శించిన ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌.

కడియపులంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు టి.రాముడు తయారు చేసిన ‘ఉమెన్‌ ట్రాఫికింగ్‌’ ప్రాజెక్టు.

1/1

Advertisement
Advertisement