‘ఈశాన్యం’లో సామరస్యం

30 Mar, 2022 00:38 IST|Sakshi

సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక  ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది.

అస్సాం–నాగాలాండ్‌ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. 

అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్‌ తారాబరి, గజంగ్‌ రిజర్వ్‌ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్‌ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్‌ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది.

అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్‌ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు.

అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి.

కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్‌ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది.

అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి.

‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు.

యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు.

మరిన్ని వార్తలు