కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచారు

6 Nov, 2023 05:40 IST|Sakshi

బిహార్‌ సీఎం నితీశ్‌పై హోం మంత్రి అమిత్‌ షా విమర్శలు

ముజఫర్‌పూర్‌: బిహార్‌లోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను ఉద్దేశపూ ర్వకంగానే ఎక్కువ చేసి చూపించిందని హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. మొత్తమ్మీద వెనుకబడిన కులాల వారికి మొండిచేయి చూపిందని చెప్పారు. ముజఫర్‌పూర్‌ జిల్లా పటాహిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు.

ముస్లింల పట్ల అనుసరిస్తున్న బుజ్జగింపు వైఖరి ఫలితంగా నేపాల్, బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తప్పవని నితీశ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కోరారు. ‘నితీశ్‌ కుమార్‌ ప్రధాని పీఠంపై ఆశలు వదులుకోవాలి. అది ఎన్నటికీ జరగ దు. ఇండియా కూటమికి కనీసం ఆయన కన్వీనర్‌ అయినా కాలేకపో యారు. బిహార్‌లో గూండారాజ్యాన్ని తిరిగి రావడానికి ఆయనే బాధ్యుడు’అని ఆరోపించారు. గతంలో కులగణనకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో రాష్ట్రంలో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు.

ఓబీసీలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇప్పుడు అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతానంటోందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో అధికారం పంచుకుంటున్న జేడీయూ, ఆర్‌జేడీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయంటూ అమిత్‌ షా, ఈ కూటమి ఏకైక ఎజెండా ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఈ కూటమి పార్టీలు వ్యతిరేకించాయని కూడా మంత్రి చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో 27 మంది మంత్రులు, అంటే 35 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారేనన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఓబీసీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు.

మరిన్ని వార్తలు