బీజేపీ జైత్రయాత్ర

12 Nov, 2020 00:32 IST|Sakshi

ఐపీఎల్‌ స్కోర్‌ మాదిరే క్షణక్షణానికీ మారుతూ దేశ ప్రజలందరిలోనూ ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరకు ఎన్‌డీఏకే విజయం ఖాయం చేశాయి. మంగళవారం రోజంతా టీవీల ముందు కూర్చున్నవారిని నిరాశ పరుస్తూ ఎంతకూ తేలని అంతిమ ఫలితాలు... ఎట్టకేలకు బుధవారం వేకువజామున వెలువడ్డాయి. 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎప్పటిలాగే ఎన్‌డీఏ ఈసారి కూడా ఆధిక్యత సాధించింది. అయితే దాని మెజారిటీ 125కి పడిపోయింది.

ఎన్‌డీఏలో ఇంతవరకూ ప్రధాన పక్షంగా వుంటున్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌(యూ) కేవలం 43 స్థానాలతో ద్వితీయ స్థానంలోకి వెళ్లగా, ఆ చోటును 74 స్థానాలతో బీజేపీ చేజిక్కించుకుంది. కూట మిలోని చిన్న పార్టీలైన వికాస్‌శీల్‌ పార్టీ, హిందూస్తాన్‌ అవామీ పార్టీ చెరో నాలుగూ గెల్చుకున్నాయి. నితీశ్‌పై అలిగి కూటమినుంచి బయటికెళ్లి ఒంటరిగా బరిలో నిలిచిన లోక్‌జనశక్తికి  ఒక్క స్థానం దక్కింది. నితీశ్‌ను 71 స్థానాల నుంచి 43కి తగ్గించి ఎన్‌డీఏలో జూనియర్‌ పార్టనర్‌గా మార్చిన తృప్తి మాత్రం మిగిలింది. ఎల్‌జేపీ వల్ల 59 స్థానాల్లో ఎన్‌డీఏకు విజయం చేజారిందని లెక్కలు చెబు తున్నాయి.

ఎన్‌డీఏకు చివరివరకూ చుక్కలు చూపించిన మహాకూటమిలో ఆర్‌జేడీ ఒకటే సత్తాగల పార్టీ. అందులోని కాంగ్రెస్, వామపక్షాలు చిన్న పార్టీలే. ఆర్‌జేడీ 144 స్థానాలకు పోటీచేసి 75 స్థానాలు గెల్చుకోగా...ఆ కూటమిలోని కాంగ్రెస్‌ దురాశకు పోయి 70 స్థానాలు తీసుకుని కేవలం 19 చోట్ల మాత్రమే నెగ్గింది. రద్దయిన అసెంబ్లీలో ఆ పార్టీ స్థానాలు 27. కాంగ్రెస్‌కన్నా వామపక్షాలు ఎంతో నయం. సీపీఐ 6చోట్లా, సీపీఎం 4 చోట్లా పోటీచేసి చెరో రెండూ గెల్చుకున్నాయి. రద్దయిన అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకూ ప్రాతినిధ్యం లేదు. కూటమిలోని మరో వామపక్షం సీపీఐ ఎంఎల్‌ 19 స్థానాలు తీసుకుని 12చోట్ల విజయం పొందింది. విడిగా పోటీచేసిన ఎంఐఎం అయిదు స్థానాలు గెల్చుకుని ఔరా అనిపించుకుంది.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో నిజమైన యోధుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేనాటికి ఎవరూ ఆయన్ను గట్టి పోటీదారుగా పరిగణించలేదు. బిహార్‌లో ఎన్‌డీఏ పాలనపై తీవ్రమైన అసంతృప్తివున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ అదే అధికారంలో కొస్తుం దని అందరూ అంచనా వేశారు. అపార అనుభవమున్న ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుపాలు కావడం, తేజస్వికి ఎన్నికల సారథ్య అనుభవం పెద్దగా లేకపోవడంవల్ల ఆ పార్టీ నాయ కత్వంలోని మహాకూటమి కనీసం గట్టి పోటీ ఇస్తుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేకపో యింది. పైగా అటు పదిహేనేళ్లుగా అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతూవస్తున్న నితీశ్‌ నాయ కత్వం లోని ఎన్‌డీఏ కూటమి. కేంద్రంలో ప్రధానితో మొదలుపెట్టి అతిరథులు, మహారథులు, అర్థ రథులు... అందరూ ఆ కూటమిలోనే వున్నారు.

బీజేపీకి సుశిక్షితులైన కార్యకర్తల సైన్యం వుంది. నెల రోజుల ముందు తేజస్వి ఈ అంచనాలను తారుమారు చేశారు. ఎన్నికల ఎజెండాను తానే నిర్ణయిం చారు. ఆయన  సవాళ్లకు జవాబివ్వడంతోనే అవతలివారికి సరిపోయింది. ఎక్కడా మాట తూలలేదు. ఎవరినీ కించపరచలేదు. తనను ప్రధాని మోదీ ‘జంగిల్‌ రాజ్‌ కీ యువరాజ్‌’ అన్నా ఆయన్ను పల్లెత్తు మాట అనలేదు. తమను గెలిపిస్తే యువతకు 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన ఇచ్చిన హామీ అత్యధిక వలసలుండే బిహార్‌లో మంత్రంలా పనిచేసింది. మొదట్లో ఆచరణ సాధ్యంకానిదని తేల్చే సిన బీజేపీ చివరకు ఆ ఉద్యోగాల సంఖ్యను 19 లక్షలకు పెంచి, కేంద్రంలో అధికారంలో వున్నందున తాము మాత్రమే ఆ పని చేయగలమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 

అయితే అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తేజస్వికి కాంగ్రెస్‌ శిరోభారమైంది. స్థోమత లేకున్నా తగుదునమ్మా అంటూ 75 సీట్ల జాబితాను ఆయన ముందు పెట్టింది. ఇస్తే సరేసరి... లేకుంటే ప్లాన్‌ బీ వుందని హెచ్చరించింది. లాలూ రంగంలో వుంటే వేరుగా వుండేది. చివరకు ఆ పార్టీకి 70 స్థానాలివ్వక తప్పలేదు. ఎక్కువచోట్ల పోటీచేస్తేనే భవిష్యత్తులో పార్టీ విస్తరిస్తుందన్న మతిలేని తర్కంతో అది పట్టుదలకు పోయింది. స్వస్వరూప జ్ఞానంతో కాంగ్రెస్‌ 35 లేదా 40సీట్లకు సరిపెట్టుకుంటే ఆర్‌జేడీ మరో 25 స్థానాలు సునాయాసంగా చేజిక్కించుకునేది. కూటమికి పీఠం అందేది.

బిహార్‌ రాజకీయ రంగం ప్రత్యేకతేమంటే... అక్కడ కూటమిగా వచ్చే పార్టీలకే ఆదరణ వుంటుంది. కనుకనే ఈ పొత్తు తప్పలేదు. వామపక్షాలకు, ముఖ్యంగా సీపీఐ ఎంఎల్‌కు మంచి ప్రజా పునాది వుందని గ్రహించిన తేజస్వి వారిని కూటమిలోకి తీసుకురాగలిగారు. మండల్‌ రాజకీయాలకు ఆర్థిక ఎజెండాను కూడా జోడించి మధ్యతరగతి విద్యావంతుల్ని ఆకర్షించారు. అయితే కరోనాను ఎదుర్కొనడంలో వైఫల్యం, లాక్‌డౌన్, వలసజీవుల వెతలు వగైరాలతో సతమతమైన బిహార్‌లో ఇవేమీ చర్చకు రాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని, కూటమిలో ప్రధాన పక్షంగా అవతరించిన బీజేపీ... దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. 59 స్థానాల్లో 41 రాబట్టుకుంది. కాంగ్రెస్‌ను 31 చోట్ల ఓడించి దాన్ని మరింత కుదించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో బీజేపీ ఎన్నదగిన విజయాలు సాధించింది. తెలంగాణలోని దుబ్బాక స్థానంలో ఆ పార్టీ గెలుపు కూడా ఎన్న దగింది. అచ్చం బిహార్‌ ఫలితాల మాదిరే అక్కడా విజయం దోబూచులాడింది. చివరంటా గెలు పెవరిదో చెప్పలేని ఉత్కంఠ ఏర్పడింది. బీజేపీ యువత అటు సోషల్‌ మీడియాలో, ఇటు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా పనిచేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంవల్ల వచ్చిన సాను భూతి పవనాలనూ, అడుగడుగునా ఎదురైన అడ్డంకులనూ వారు అధిగమించారు. ఏదేమైనా ఈ విజయాలన్నీ పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సా హంగా పోరాడేందుకు బీజేపీ శ్రేణులకు స్ఫూర్తినిస్తాయి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు