Benjamin Netanyahu: న్యాయం’పై నెతన్యాహూ కక్ష

22 Feb, 2023 03:08 IST|Sakshi

అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్‌ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి.

వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి.  నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు.

అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. 


తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్‌ పనిచేస్తోంది.

ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి.

మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలన్న డిమాండ్‌ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్‌ పౌరుల ఆవాసాలున్నాయి.

వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది.

ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్‌కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్‌ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం.

ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు.  

మరిన్ని వార్తలు