అలా జరిగి ఉండకపోతే..

18 Apr, 2022 00:37 IST|Sakshi

ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది.

మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్‌ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్‌ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు  అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. 

ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్‌ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. 

వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్‌ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్‌. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్‌ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్‌ సోవియట్‌ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్‌ రష్యాకు సవాల్‌ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్‌ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్‌ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్‌ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్‌ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్‌ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. 

బ్రిటిష్‌ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్‌?’ అని కాలర్‌ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్‌. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. 

మరిన్ని వార్తలు