నడుస్తున్న చరిత్ర!

31 Oct, 2023 00:23 IST|Sakshi

పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్‌) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది.

అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్‌’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్‌ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 

2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్‌ చరిత్ర ప్రొఫెసర్‌ అయిన సీఐ ఐజాక్‌ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్‌)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది.

ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్‌ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. 

‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్‌ ‘భారత్‌’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్‌ భారత్‌’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్‌’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది.

అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్‌’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్‌ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్‌’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్‌’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. 

ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్‌ ఐజాక్‌ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్‌ దీక్షిత్‌ సారథ్యంలోని కమిటీని కోరారు.

దీక్షిత్‌ సాక్షాత్తూ ఇండియన్‌ ఆర్కియలాజికల్‌ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. 

అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్‌ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. 

చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు.

చంద్రయాన్‌–3, నారీ శక్తి వందన్, కోవిడ్‌ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు!  

మరిన్ని వార్తలు