-

మాటకు కట్టుబడి...

27 Nov, 2023 00:20 IST|Sakshi

మన తెలుగు రాజు హాలుడు సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు పండితులు వస్తారు నేర్పేందుకు. ఒకడు గుణాఢ్యుడు. రెండు శర్వవర్మ. ‘నేను మీకు సంస్కృతం నేర్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది’ అంటాడు గుణాఢ్యుడు. రాజుగారి అర్జెన్సీ గమనించిన శర్మవర్మ ‘నేను ఆరు నెలల్లో నేర్పుతాను’ అంటాడు. అది అసాధ్యం. కనుకనే గుణాఢ్యుడు ఆగ్రహంతో ‘అదే జరిగితే నాకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలన్నింటినీ విడిచి పెట్టేస్తాను’ అంటాడు. శర్వవర్మ ఏవో తిప్పలు పడి కొత్త వ్యాకరణం రాసి ఆరు నెలల్లో రాజుగారికి సంస్కృతం వచ్చు అనిపిస్తాడు.

ఇందుకు గుణాఢ్యుడు ఆశ్చర్యపోయి, మొత్తానికి సాధించావ్‌ అనేసి తన దోవన తాను పోతే ఎవరూ ఏమీ అనరు. తల తీసి మొలేయరు. కాని మాటకు విలువ ఇచ్చే కాలం అది. గుణాఢ్యుడు మహా పండితుడు. భాషే జీవంగా జీవించేవాడు. అలాంటివాడు తానిచ్చిన మాటకు విలువనిచ్చి తనకు తెలిసిన అన్ని భాషలను వదిలిపెట్టి, మౌనిగా మారి, అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ అతను పైశాచి భాష నేర్చుకుని ‘బృహత్కథ’ రాయడం వేరే విషయం. కాని మాటకు కట్టుబడటం వల్లే కదా ఇన్ని వందల ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాము.

మనిషి గుంపు జీవనం మొదలెట్టే నాటికి లిపి లేదు. రాతకోతలు లేవు. నోటి మాటే శిలాశాసనం. మాట ఇవ్వడం అంటే ఒప్పందం చేసుకోవడమే.  రాజ్యాలు ఏర్పడ్డాక ‘మాటకు కట్టుబడటం’ ఒక విలువగా, యుగ స్వభావంగా స్థాపన చేసేందుకు సత్య హరిశ్చంద్రుడి కథ విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చింది కేవలం మాటే. 

హరిశ్చంద్రుడు పాలకుడు, రాజు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎవరూ ఏమీ చేయరు. కాని మాట తప్పిన అపప్రథను శిరస్సున మోయడం కంటే రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి కూడా కోల్పోయేందుకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు మరింత ఉదాత్తుడు. తన మాటకు కాదు, తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. ‘నువ్వు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి నాన్నా’ అనంటే దశరథుడు చేయగలిందేముంది? అందుకే రాముడు దేవుడు. 

గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళుతూ తన తల్లికి ‘మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లను’ అని మాట ఇచ్చారు. అక్కడకు వెళ్లాక మద్యం ఎలాగూ అలవాటు లేదు. మగువకు లోబడలేని నిష్ఠ ఉంది. కాని మాంసం జోలికి వెళ్లకుండా, అక్కడ అదే దొరుకుతుంది కనుక, ఎలా ప్రాణాలు నిలబెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అయినా సరే, మాట తప్పలేదు– ఆకలికి తాళలేక పచ్చి బియ్యం బొక్కాడు తప్ప. నిజం. అలా ఉండేవారు జనులు, తల్లికి మాట ఇస్తే, గురువు మాట ఇస్తే్త, తమకు తాము మాట ఇచ్చుకుంటే  జీవితాంతం  కట్టుబడేవారు. ఉత్తరాదిలో ‘ప్రాణ్‌ జాయ్‌ పర్‌ వచన్‌ నా జాయ్‌’ అంటారు. మాట పోతే ప్రాణం పోయినట్టే!

మరి కల్తీ సరుకు రాకుండా ఉంటుందా? ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రి తన శిష్యుణ్ణి ఆడవేషం కట్టమని చెప్పి, ఆ వేషంలో లుబ్ధావధాన్లను పెళ్లి చేసుకోమని ‘నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి ఇల్లరికం వుంచుకుంటాను’ అంటాడు. ‘మాట తప్పితే భూమి తోడ్రా’ అనంటాడు. దానికి శిష్యుడు ‘మీరు యగేస్తే భూవేం చేస్తుందిలెండి?’ అనంటాడు. మాట ఇవ్వడాన్ని పాతకాలపు చాదస్తంగా, మాట తప్పడాన్ని కొత్త జీవన మంత్రంగా పసిగట్టి గురజాడ ‘కన్యాశుల్కం’లో ఆనవాలు వదిలాడు. నిజమే. మనుషులు కాగితాన్ని తప్ప మాటను నమ్మని పరిస్థితి వచ్చింది.

ఎక్కడి మాట అక్కడే మర్చిపోవాలి అనే గిరీశాలు మూలకొకడు, మలుపుకొకడు తయారయ్యారు. ‘ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్‌ గదన్నా ఘన సంపన్న’ అనే పద్యం వీరి ఎదుట చదివితే ‘తిట్టుకో తిట్టుకో... అలాగే అలాగే’ అని కాఫీ తాగి లేచ్చక్కా పోతుంటారు.

కాని ఎంత అధ్వాన్న రోజుల్లోనైనా వడగడితే జారిపోని విలువలు ఎన్నోకొన్ని మనుషులు మిగుల్చుకునే ఉంటారు. మాట తప్పని స్వభావాన్ని వారు నేటికీ గౌరవిస్తూనే ఉన్నారు. ఈ భూమి, ఈ వనరులు, ఈ సంపద, ఈ గాలి, నీరు... వీటన్నింటికీ తాము సమాన హక్కుదార్లమని తెలిసినా, పోరాడి పొందగలిగే శక్తి ఉన్నా, పాలకులుగా... ఏలికలుగా సింహాసనాల్లో కూర్చున్నవారు తమకు నాలుగు మెతుకులుగా విదిల్చితే పొందాలేమోనన్న స్థితికి వారు నెట్టబడినా, ఇలాంటి స్థితిలో కూడా వారు ఎవరి మాట సత్తుదో, ఎవరి మాటలో సత్తువున్నదో సూక్ష్మంగా గమనిస్తూనే ఉంటారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ ఇంగితజ్ఞానం అనే గీటురాయిని బయటకు తీస్తూనే ఉంటారు. నమ్మిన మాటను గెలిపిస్తారు. ఒకవేళ అది నమ్మించిన మాట మాత్రమే అని గ్రహిస్తే సందర్భం కోసం కాచుకుని ఉంటారు. ‘తప్పుడు వెధవ’ అనే తిట్టు ఉంది. అంటే తప్పు చేసినవాడు మాత్రమే కాదు మాట తప్పినవాడు కూడా!

ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు అందించడం అనే ఒక సరళ సూత్రంలో పాలకుడు వాహిక మాత్రమే. ప్రజలకు మంచి చేస్తాను అనే మాట మాత్రమే అతనికి శిరోధార్యం కావాలి. జనం చెవిలో పువ్వు పెట్టే నాలుగు మాటలు చెప్పి తమ మెడలో విజయహారాలు ధరిద్దామనుకుంటే అది గేమ్‌లో భాగమే కావచ్చు. కాని అలాంటి గేమ్‌లో ఠక్కున ఔటవడమే గాక మాటగా కూడా గుర్తురాని స్థితికి దిగజారి పోతారు. మాటలు వెదజల్లకండి. ఇవ్వగలిగిన మాట మాత్రమే ఇవ్వండి. మాట జాగ్రత్త! 

మరిన్ని వార్తలు