Rajasthan Election 2023: రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్‌ శాతం

26 Nov, 2023 12:10 IST|Sakshi

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 199 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 0.9 శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 74.96 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో  ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ బీజేపీకి, తగ్గినప్పుడు కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతూ వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందనే దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

రాజస్థాన్‌లో గత ఐదు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే, ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం వస్తోంది. గత 20 ఏళ్ల ఓటింగ్ ట్రెండ్ కూడా ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ లాభపడిందని, ఓటింగ్ పెరిగినప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. దీంతో డిసెంబరు 3న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాత ట్రెండ్ కొనసాగుతుందో లేదో అనేది ఆరోజున తేలిపోనుంది. 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని 20 ఏళ్ల రాజస్థాన్ ఎన్నికల చరిత్ర చెబుతోంది. 1998 ఎన్నికల్లో 63.39 శాతం ఓటింగ్‌ రావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. గెహ్లాట్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2003 ఎన్నికల్లో ఓటింగ్ 3.79 శాతం పెరిగింది. 67.18 శాతం ఓటింగ్ జరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వసుంధర రాజే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2008లో రాష్ట్రంలో 66.25 శాతం ఓటింగ్ నమోదై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఓటింగ్ శాతం 0.93 శాతం తగ్గింది. గెహ్లాట్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

2013 ఎన్నికల్లో మరోసారి 8.79 శాతం ఎక్కువ ఓటింగ్ రావడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. రాజే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో 0.98 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తం 74.06 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో తక్కువ ఓటింగ్‌ శాతం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో బీజేపీకే విజయావకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 
ఇది కూడా చదవండి: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

మరిన్ని వార్తలు