పరీక్షలపై పునరాలోచన ఉత్తమం 

20 Aug, 2020 00:43 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి భూగోళంపై పంజా విసరడం మొదలుపెట్టి ఏడు నెలలు కావస్తోంది. దాని తీరు అర్థం చేసుకోవడంలో, అరికట్టడంలో వైద్యరంగ నిపుణులు ఇప్పటికీ పూర్తిగా విజయం సాధించలేకపోయారు. వాక్సిన్‌ అందుబాటులోకొచ్చేవరకూ ఇది తప్పదు. అంతవరకూ అందరూ ఆ మహమ్మారి విషయంలో అప్రమత్తంగా వుంటూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన తీర్పును ఈ నేపథ్యంలో చూడాలి. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయడం కుదరదని, అవి యథాప్రకారం వచ్చే నెలలో నిర్వహిం చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1

1 రాష్ట్రాలకు చెందిన 11మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ వైరస్‌ కనుమరుగు కావడానికి ఎంతకాలం పడుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయడం ఎలా సమర్థనీయమని ధర్మాసనం ప్రశ్నించింది. సమస్యలెన్నివున్నా జీవనం సాగుతూ వుండా ల్సిందేనని వ్యాఖ్యానించింది. నీట్, జేఈఈలపైనే కాదు... విశ్వవిద్యాలయాలు డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలను సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలంటూ యూజీసీ గత నెల 6న జారీచేసిన నోటిఫి కేషన్‌పైనా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అలాగే ఆయుష్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. విశ్వవిద్యాలయాల పరీక్షల నిర్వ హణపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనకాడుతున్నాయి. 

కరోనా వైరస్‌ మహమ్మారిపై పౌరుల్లో నెలకొన్న భయాందోళనలకు ఈ పిటిషన్లు అద్దం పడుతున్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రోజూ దాదాపు 60,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పరీక్షల సంఖ్య పెరగడం, ప్రజల్లో చైతన్యం పెరిగి అనారోగ్యంపాలైతే స్వచ్ఛందంగా పరీక్షకు సిద్ధపడటం వల్ల ఈ స్థాయిలో కేసులు వెల్లడవుతున్నా యనుకోవచ్చు. కరోనాకు ఇంతవరకూ మందు లేదు. అయితే దాన్ని అరికట్టడంలో తోడ్పడుతున్నాయని నిర్ధారణ అయిన వేరే వ్యాధుల ఔషధాలను వ్యాధిగ్రస్తులకు వినియోగిస్తున్నారు.

రోగి లక్షణా లనుబట్టి వివిధ మందులతో చికిత్స చేస్తున్నారు. కరోనా వచ్చి తగ్గినవారిలో లభించే సీరమ్‌తో కూడా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీటన్నిటివల్లా రికవరీ రేటు చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ఇంకా వెనకబడేవున్నాయి. వెల్లడైన కేసులతో పోలిస్తే వ్యాధిగ్రస్తులు మూడు రెట్లు ఎక్కువ వుండొచ్చని హైదరాబాద్‌ నగరంలో పరిశోధన చేసిన సీసీఎంబీ సంస్థ అంచనా వేస్తోంది. మొన్న మే నెలవరకూ ఆ వ్యాధిని అరికట్టడంలో విజయం సాధించినట్టే కనిపించిన కేరళలో ఆ తర్వాత క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇవన్నీ పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయి. 

రెండురోజులక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన కూడా గమనించదగ్గది. ప్రస్తుతం 20–40 ఏళ్ల వయసులోవున్నవారి వల్ల కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని ఆ సంస్థ హెచ్చ రించింది. ఈ వయసువారు కరోనా బారినపడినా లక్షణాల జాడ లేకపోవడంతో యధేచ్ఛగా తిరుగు తున్నారని, పర్యవసానంగా వ్యాధి వ్యాపిస్తోందని వివరించింది. పరీక్షలు నిర్వహించే ముందు ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోక తప్పదు. విద్యార్థుల కెరీర్‌ చాలా ముఖ్యమే. నీట్, జేఈఈ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సివుంది. ఈ పరీక్షలేమిటి... సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు మొదలుకొని దాదాపు అన్ని పరీక్షలూ అప్పటినుంచీ వాయిదాలు పడుతూనే వున్నాయి.

కొన్ని రాష్ట్రాలు చేసేది లేక టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులను చేయాల్సివచ్చింది. తరగతుల నిర్వహణ సమస్యగా మారడంతో ఆన్‌లైన్‌ బోధనవైపు మొగ్గుచూపే ధోరణి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల కెరీర్‌ అయోమయంలో పడుతుందన్న ఒక్క కారణంతో ప్రవేశ పరీక్షలు యధావిధిగా జరపాలనడంలో సహేతుకత ఏమిటో అర్థంకాదు. నీట్‌కు 17 లక్షలమంది, జేఈఈకి 11 లక్షలమంది హాజరుకావాల్సివుంది. ఈ పరీక్షల్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుని జరుపుతామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.

పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారనడంలో సందేహం లేదు. కరోనా లక్షణాలున్న అభ్యర్థుల్ని అనుమతించే ప్రశ్నే ఉండక పోవచ్చు. లక్షణాలు కనబడనివారి సంగతేమిటన్నది సమస్య. ఇలాంటివారే వ్యాధిని వ్యాపింప జేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పింది. ఆ విషయంలో ఎన్‌టీఏ ఎలాంటి హామీ ఇవ్వగలదు? పైగా లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిగా తొలగించకపోవడంతో అనేకచోట్ల రవాణా సదుపాయాలు పడకేసివున్నాయి. కనుక అభ్యర్థులు, వారితోపాటు వచ్చే తల్లిదండ్రులూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం పెద్ద సమస్య. సాధారణ సమయాల్లో వీరు పరీక్షా కేంద్రాలున్న నగరాలకూ, పట్టణాలకూ ముందురోజే చేరుకుని బంధువుల ఇళ్లలో, హోటళ్లలో ఆశ్రయం పొందుతారు.

ఇప్పుడు ఆ పరిస్థితి వుందా? వారికి ఆతిథ్యం ఇవ్వాల్సిన బంధువులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందోనని బెరుగ్గా వుంటారు. చాలా హోటళ్లు ఇంకా తెరుచుకోలేదు. మామూలుగా పనిచేస్తున్న హోటళ్లలో ముందుజాగ్రత్త చర్యలెలావున్నాయన్నది కూడా సందేహాస్పదం. మొత్తానికి కరోనాకు చిక్కకుండా అందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరతారన్న గ్యారెంటీ లేదు. ఈ పరి స్థితుల్లో విలువైన విద్యా సంవత్సరం వృథాగా పోతుందన్న ఆత్రుతలో ఇతర అంశాలను విస్మ రించడం మంచిదికాదు. కనుక కేంద్రం మరోసారి ఈ సమస్యపై దృష్టిపెట్టాలి. విద్యారంగ నిపు ణులతో, వైద్య నిపుణులతో చర్చించి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలపై తుదినిర్ణయం తీసుకోవాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా