ఆర్థిక అవస్థ! 

2 Jun, 2021 03:39 IST|Sakshi

వ్యవసాయం, మత్స్యరంగం, అటవీ రంగం మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెలువరిం చిన గణాంకాలు ఆర్థిక నిపుణులు కొంతకాలంగా వ్యక్తం చేసిన భయాందోళనలను ధ్రువీకరిస్తు న్నాయి. కరోనా మహమ్మారి తొలి దశను అడ్డుకోవటానికి నిరుడు దీర్ఘకాలంపాటు విధించిన లాక్‌డౌన్‌ వల్ల మొత్తంగా వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదు అయింది. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్‌బీఐ, ఇతర సంస్థలు  భావించినా నాలుగో త్రైమాసికంలో అన్ని రంగాలూ ఏదోమేర పనిచేయటం మొదలుకావటంతో ఆ సమ యంలో స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదు చేసిన పర్యవసానంగా మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం స్వల్పంగా తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రతికూల వృద్ధి నమోదు కావటం ఇదే తొలిసారని అంటున్నారు. ద్రవ్యలోటు సైతం జీడీపీలో 9.3 శాతమని తేలింది. దేశ పాలకుల దగ్గర ఇందుకు సంబంధించి ముందస్తు అంచనాలు ఏమేరకున్నాయోగానీ అంతా సవ్యంగా వున్నదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో కలగజేయటానికి ప్రయత్నించటమే గత ఏడెనిమిది నెలలుగా కనబడుతుంది. ఒకపక్క అమెరికా మొదలుకొని అన్ని దేశాలూ తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకొంటుండంగా, రకరకాల ప్యాకే జీల ద్వారా చేసిన కేటాయింపులు, వాటి చుట్టుతా వున్న నిబంధనలవల్ల మెజారిటీ ప్రజలకు అందకుండా పోయాయి. విద్యావంతులైన యువత ఉపాధిని కోల్పోయింది. కొత్తవారికి ఉపాధి ఊసేలేదు. రోజువారీ పనులు చేసి పొట్ట పోసుకునే వర్గాల పరిస్థితి అయితే మరింత దారుణం. ఇన్ని వర్గాలు నిస్సహాయ స్థితిలో పడబట్టే వినియోగం బాగా పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నది వాస్తవం. 

కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడింది. తయారీ రంగం అనుకున్నంత కాకపోయినా కొంతయినా పుంజుకుంది. అది పన్నుల వసూళ్లలో ప్రతిఫలి స్తున్నది. కేంద్రానికి పన్ను ఆదాయం బడ్జెట్‌ అంచనాతో పోలిస్తే 5.5 శాతం అధికమని తేలింది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనే వర్గాలెక్కడ? వినియోగదారుల సూచీని గమనిస్తే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు డిసెంబర్‌లో డిమాండ్‌ గణనీయంగా పడిపో యిందని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం చీఫ్‌ మహేష్‌ వ్యాస్‌ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 97 శాతం కుటుంబాల ఆదాయం క్షీణించిందని ఆ సంస్థ సర్వే తెలి పింది. కేవలం 3 శాతం కుటుంబాలు మాత్రమే తమ ఆదాయం పెరిగిందని చెప్పాయి. 55 శాతం కుటుంబాలు ఏదో నెట్టుకు రాగలుగుతున్నామని చెప్పగా...మిగిలిన 42 శాతం కుటుం బాలు కరోనాకు ముందూ తర్వాతా ఒకేలా వున్నామని చెప్పాయి. అంటే జనాభాలో అధిక శాతంమంది ఆదాయ క్షీణత అంతక్రితమే మొదలైందన్నమాట. 

ఈమధ్య ఫిక్కీ సంస్థ రూపొందించిన బిజినెస్‌ కాన్ఫిడెన్స్‌ సూచీ(బీసీఐ)ని కూడా ప్రస్తావిం చుకోవాలి. వర్తమాన పరిణామాలు చూశాక వ్యాపార సంస్థల్లో ఆత్మవిశ్వాసం బాగా సన్నగిల్లిం దని ఆ సర్వే చెబుతోంది. మూడు త్రైమాసికాలకు ముందున్న ఆత్వవిశ్వాసం వ్యాపా రుల్లో ఇప్పుడు కొరవడిందని అది వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ. 145 లక్షల కోట్లు కాగా, నిరుడు దీనికి పదిలక్షల కోట్ల మేర గండి పడింది. కనీసం 2019– 20నాటి స్థితికి చేరాలన్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు. మన జీడీపీ 2019–20నాటి స్థాయికెళ్లాలంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కావాలి. ఈ రెండో దశ కరోనాలో పరిమిత స్థాయిలో విధించిన లాక్‌డౌన్‌ల వల్ల నిరుడు కలిగినంత నష్టం వుండకపోవచ్చు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారి ఉపాధిని ఈ లాక్‌డౌన్‌లు పూర్తిగా ఊడ్చిపెట్టాయి. ఇదంతా మౌనంగా వీక్షిస్తున్న సాధారణ పౌరుల్లో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆక్సిజన్‌ కొరత, ఔషధాల కొరత, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి వగైరా కారణాలతో కళ్లముందు జనం పిట్టల్లా రాలిపో వటంచూశాక వారు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. రోజువారీ తప్పనిసరి అవస రాలు మినహా మరి దేనిపైనా వ్యయం చేసేందుకు ప్రజలు వెనకాడుతున్నారు.  కనుకనే విని యోగం భారీగా పడిపోయింది. ఆదాయ కల్పన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ప్రశంసనీయమైన చర్యలు తీసుకుంది. వివిధ పథకాలకింద నగదు బదిలీ ద్వారా రూ. 95,528 కోట్లను...ఇతరేతర పథకాల ద్వారా పరోక్షంగా రూ. 36,197 కోట్లను ప్రజలకు అందజేసింది. అంటే రూ. 1,31,725 కోట్ల మొత్తం ప్రజానీకానికి చేరింది. ఈ గణాంకాలు గత రెండేళ్లలో అమలైన పథకాలకు సంబంధించినవే అయినా ఇందులో అధిక కాలం కరోనా ముట్టడిలోనే గడిచిందన్నది గుర్తుంచుకోవాలి.  కేంద్రం చర్యలు కూడా దీనికి దీటుగా వుంటే ఆర్థిక వ్యవస్థకు అది మరింత తోడ్పడేది. కనీసం కరోనా టీకాలైనా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందు బాటులోకొస్తే పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకోవటం మొదలవుతుంది. 2019 సెప్టెంబర్‌లో జీడీపీ తగ్గినప్పుడు వృద్ధి ప్రక్రియలో అదొక భాగమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది కనుక కేంద్రం పునరాలోచించాలి.  

మరిన్ని వార్తలు