శరణార్థులపై పాక్‌ పంజా

7 Nov, 2023 03:53 IST|Sakshi

నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్‌ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్‌ గడ్డపై హమాస్‌ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్‌లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది.

వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్‌లు బెదిరిస్తున్నా పాక్‌ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్‌ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్‌ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్‌లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్‌ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్‌ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది.

80వ దశకంలో అఫ్గాన్‌పై సోవియెట్‌ యూనియన్‌ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్‌కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్‌ దళాలు నిష్క్రమించాక తాలిబన్‌ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్‌పై దండయాత్రకు దిగింది. తాలిబన్‌లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది.

అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్‌కు కంటగింపైంది. అఫ్గాన్‌లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్‌ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్‌ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్‌ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది.

ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్‌లు, చెడ్డ తాలిబన్‌లు అంటూ వర్గీకరించి అఫ్గాన్‌ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్‌ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్‌ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్‌ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్‌లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్‌ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్‌లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్‌ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్‌ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్‌ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు.

ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్‌ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్‌లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్‌ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది.

కొందరిని బలూచిస్తాన్‌ వైపున్న చమన్‌వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్‌ మీడియా చెబుతోంది. 

ఉగ్రవాదం విషయంలో పాక్‌ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు,  ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్‌లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్‌ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి.  

మరిన్ని వార్తలు