మరో నిఘా నేత్రం?

3 Nov, 2023 04:35 IST|Sakshi

నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్‌ సంస్థ అక్టోబర్‌ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్‌తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది.

వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్‌ ఐ–ఫోన్‌ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్‌ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. 

ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ ‘పెగసస్‌’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్‌వేర్ల కొనుగోలుకు భారత్‌ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్‌ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్‌ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. 

తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్‌ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్‌ మాట.

ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్‌ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్‌ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్‌ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్‌ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్‌ కూడా నమ్మకం కలిగించాలి.  

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్‌ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్‌ వాదనను ‘యాక్సెస్‌ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్‌ ఫైనాన్షియర్‌ జార్జ్‌ సోరోస్‌కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్‌ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు.

పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం.

ఆపిల్‌ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్‌ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్‌ వివరాలు నమోదు చేసే ‘యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ సర్వర్‌ కట్టుదిట్టమైనదే.

కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్‌ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. 

ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్‌’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. 

మరిన్ని వార్తలు