Tamil Nadu: నాలుగు స్తంభాలాట

14 Jul, 2022 00:04 IST|Sakshi

అనుకున్నంతా అయింది. ఎంజీఆర్‌ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్‌ సెల్వమ్‌ (ఓపీఎస్‌)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్‌) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్‌ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. 

జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్‌ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్‌ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ తాజా భేటీకి ముందు జూన్‌ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్‌ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్‌ ప్రత్యర్థులదే పైచేయి అయింది. 

నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్‌లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్‌గా ఉంటే, ఓపీఎస్‌ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్‌లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్‌ కౌన్సిల్‌లో ఈపీఎస్‌కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్‌పై బహిష్కరణ వేటు.  

దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్‌ – ఈపీఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్‌ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్‌ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం.  

సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్‌ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్‌ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. 

ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్‌ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి?

మరిన్ని వార్తలు