మూడేళ్లుగా ఏం చేస్తున్నారు..? తమిళనాడు గవర్నర్‌ను నిలదీసిన సుప్రీం

20 Nov, 2023 14:04 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం తెలిపిన బిల్లులకు మూడేళ్లు ఆమోదం తెలపకుండా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్ ఆర్‌ ఎన్‌ రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ తీర్మాణించిన బిల్లులకు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగానే ఆమోదం తెలపడం లేదనే ఆరోపిస్తూ తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

సీఎం స్టాలిన్ ప్రభుత్వం పంపిన పది బిల్లులను గవర్నర్ ఆర్‌ ఎన్‌ రవి ఆమోదించకుండా వెనక్కి పంపారు. ఈ బిల్లుల్లో రెండు బిల్లులు గతంలో పాలించిన అన్నా డీఎంకే ప్రభుత్వానికి చెందినవి. అయితే.. గవర్నర్ వెనక్కి పంపగా తమిళనాడు శాసనసభ మళ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ బిల్లులను మళ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం మళ్లీ పంపింది. ఈ నేపథ్యంలో శాసనసభ రెండోసారి బిల్లులను ఆమోదించి పంపిన క్రమంలో గవర్నర్ చర్యలేంటో చూద్ధామని పేర్కొన్న ధర్మాసనం.. డిసెంబర్ 1 కి కేసును వాయిదా వేసింది. రెండోసారి పంపిన బిల్లులపై గవర్నర్ అధికారాలు మనీ బిల్లులలాగే  ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. బిల్లులను జాప్యం చేయడానికి గల కారణాలు ఏంటో తెలపాలని కోరింది.  

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్‌ కేసు: అభిషేక్ బోయినపల్లి బెయిల్ కేసు డిసెంబర్ 4కు వాయిదా

మరిన్ని వార్తలు