కాంగ్రెస్‌ సర్కారుకు సవాళ్లు

8 Dec, 2023 00:19 IST|Sakshi

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ఏలుబడి మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముఖ్యమంత్రిని నిర్ణయించటం మొదలు మంత్రుల ఖరారు వరకూ కొనసాగే కాంగ్రెస్‌ మార్కు అనిశ్చితికి పెద్దగా తావు లేకుండానే అంతా పూర్తికావటం గమనించదగ్గది. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలుండటం, తెలంగాణలో గరిష్ఠ స్థాయిలో సీట్లు రాబట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉండటం ఇందుకు కారణం కావొచ్చు. కేబినెట్‌ కూర్పులో రాజకీయ, పాలనానుభవం పుష్కలంగా వున్నవారితోపాటు కొత్త నెత్తురుకు కూడా చోటిచ్చారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో మంత్రులుగా పనిచేశారు. జూపల్లి టీఆర్‌ఎస్‌ కేబినెట్‌లో కూడా మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్‌గా,కాంగ్రెస్‌ శాసనభా పక్ష నేతగా వ్యవహరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది ప్రత్యేక రికార్డు. ఆయన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం అమాత్యులుగా పరిపాలనకు కొత్త వారు. శాఖల కేటాయింపుపై ఊహాగానాలు వస్తున్నా అధికారిక ప్రకటనపై మాత్రం సస్పెన్స్‌ ప్రస్తు తానికి కొనసాగుతోంది.

కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాక తెలంగాణలో ఆ పార్టీకి కొంత ఊపూ ఉత్సాహం వచ్చిన సంగతి నిజమే అయినా... అది అధికారాన్ని అందుకునే స్థాయికి ఎదుగుతుందని మొదట్లో ఎవరికీ అంచనాలు లేవు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా, పార్టీ శాసనసభ్యుల పైనా ప్రజానీకంలో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో పార్టీ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలం అయ్యారు.

వివిధ స్థాయుల్లో అవినీతి, సర్కారీ కొలువుల భర్తీలో ప్రదర్శించిన అలసత్వం, పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ధరణి పోర్టల్‌తో వచ్చిన సమస్యలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చాయి. సీఎం ఎవరికీ అందుబాటులో వుండరన్న అభిప్రాయం ఏర్పడటం కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. వీటన్నిటి పర్యవసానంగా ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురుచూసింది. దీన్ని అందిపుచ్చుకుంటున్నట్టే మొదట్లో కనబడిన భారతీయ జనతా పార్టీ స్వీయతప్పిదాల వల్ల క్రమేపీ వెనక్కిపోయింది. ఇది కూడా కాంగ్రెస్‌కు లాభించింది.

ఇక ఆ పార్టీ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు గెలుపును సునాయాసం చేశాయి. రైతు భరోసా కింద ఏటా రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000, రైతులకు అయిదేళ్ల వ్యవధిలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇంటింటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ప్రతి మహిళకూ నెలకు రూ. 2,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్‌ సిలెండర్, ఇంది రమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు లేనివారికి ఉచితంగా స్థలం, రూ. 5 లక్షల సాయం, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పెన్షన్, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా తదితర హామీలు కూడా సగటు ఓటరును బాగా ఆకట్టుకున్నాయి.

ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫైలు పైనే ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి తొలి సంతకం చేశారు. అయితే ఏటా రూ. 88,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ఈ పథకాల అమలుకు నిధులు సమకూర్చటం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఇవిగాక ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్ల రుణభారం ఉన్న తెలంగాణలో ఇదంతా కత్తిమీది సామే. 

ఎందుకంటే 2023–24 బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయాన్ని 2.16 లక్షల కోట్లుగా చూపారు. ఇక రెవెన్యూ వ్యయం రూ. 2.12 లక్షల కోట్లుంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రుణ పరిమితిని పెంచుకోవటానికి అనుమతించాలన్న బీఆర్‌ఎస్‌ సర్కారు వినతిని కేంద్రం తిరస్కరిస్తూ వచ్చింది. బహుశా అందువల్లే కావొచ్చు... తొలి కేబినెట్‌ భేటీలో అధిక భారం పడని రెండు గ్యారెంటీలు – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుచేయాలని నిర్ణయించారు.

ఇవి రెండూ ఈ 9వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 64 కాగా, మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానం వుంది. నిన్నటివరకూ పాలించిన బీఆర్‌ఎస్‌ 39 స్థానాలతో బలమైన ప్రతి పక్షంగా ఉంది. 8 స్థానాలు గెల్చుకున్న బీజేపీ, ఏడు స్థానాలున్న ఎంఐఎంలు సైతం పాలనా నిర్వహణను నిశితంగా గమనిస్తుంటాయి. వాగ్దానాల అమలులో విఫలమైతే నిలదీయటానికి విపక్షాలు సిద్ధంగా ఉంటాయి. బీఆర్‌ఎస్‌ ప్రాంతీయపార్టీ గనుక కేసీఆర్‌ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగారు. పాలించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సారథిగా రేవంత్‌కి పరిమితులు తప్పవు.

రాజకీయాలపై ఆసక్తి, అనురక్తి మినహా మరే నేపథ్యమూ లేని రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎది గిన తీరు ఎన్నదగ్గది. విద్యార్థి దశలో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఏబీవీపీతో, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో, అటుపై తెలుగుదేశంతో ప్రయాణించిన రేవంత్‌ రెడ్డి 2017లో అనూహ్యంగా కాంగ్రెస్‌లో కొచ్చి స్వల్పవ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడు కాగలిగారు.

ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఓటుకు కోట్లు కేసు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఇప్పటికీ ఉందంటున్న సాన్ని హిత్యం రేవంత్‌కు గుదిబండలే. వాటినుంచి ఎంత త్వరగా విముక్తులైతే అంత త్వరగా నవ తెలంగాణలో ఏర్పడిన తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వ సారథిగా ఆయన తనదైన ముద్ర వేయగలుగుతారు.  

>
మరిన్ని వార్తలు