చీకటి వెలుగులు

4 Dec, 2023 00:17 IST|Sakshi

విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి.

ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది?

అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్‌ సాంటానా.

అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్‌ సాంటానా అమెరికన్‌ గిటారిస్ట్‌. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు!

ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన.

సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్‌ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్‌ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్‌ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే!

జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు.

కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్‌ రచయిత రాబర్ట్‌ లూయీ స్టీవెన్‌సన్‌. 

‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్‌ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది.

అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు.

ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు.

ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం.  

మరిన్ని వార్తలు