ఇదో ‘అనుభూతి’ బాణం!

11 Jul, 2021 00:22 IST|Sakshi

జనతంత్రం

మంత్రివర్గాల్లో మార్పులు, చేర్పులు సాధారణం. మొన్నటి కేంద్ర మంత్రివర్గ మార్పుచేర్పులు మాత్రం అసాధారణం. గడిచిన డెబ్బయ్యేళ్ల చరిత్రలో ఇంతటి భారీస్థాయి పునర్వ్య వస్థీకరణ దేశంలో ఎప్పుడూ జరగలేదు. పన్నెండుమందిని తొల గించి 36 మందిని కొత్తగా తీసుకున్నారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి 78కి చేరింది. యూపీఏ-2ను జంబో కేబినెట్‌గా బీజేపీ వాళ్లు ఆనాడు వెక్కిరించారు. ఇప్పుడు వారి మంత్రి మండలిలో అంతకంటే ఒక నెంబర్‌ పెరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ‘పరిమిత ప్రభుత్వం-విస్తృత పరిపాలన’ తమ లక్ష్యమని చెప్పే వారు. అందుకు తగినట్టుగానే 2014లో తొలి కేబినెట్‌ కూర్పును తనతో సహా 46 మందితోనే సరిపెట్టారు. నిబంధనల ప్రకారం మంత్రిమండలి సంఖ్య 81 దాకా ఉండవచ్చు. కనుక ఇప్పటి ఈ జంబో కేబినెట్‌ను తప్పుపట్టవలసిన అవసరం ఏమీలేదు. కానీ ‘పరిమిత ప్రభుత్వం’ అనే సంకల్పం పరిధులు ఎందుకు విస్తరించవలసి వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ లేదా దాని నాయకత్వంలోని కూటమి మరోసారి గెలిచి ఢిల్లీ గద్దెనెక్కితే ఆ పార్టీ సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానానికి వీలు చిక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నామమాత్రావశిష్టంగా తయారైంది. మరో ఓటమిని నిభాయించుకోలేదు. పూర్తిగా శిథిలమైపోతుంది. ఆ శిథిలాల మీద మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సమయం పడుతుంది. ఈలోపల గట్టిగా కుదురుకుంటే, ఏక బిగిన ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ రికార్డును తిరగ రాయవచ్చన్న ఆశ బీజేపీ నాయకత్వాన్ని సలుపుతున్నది. ఇంకోసారి గెలిస్తే నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలనందించిన నాయకుడిగా మోదీ మెడలో ఓ వీరతాడు పడుతుంది. ఇందిరమ్మ నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మూడు విజయాలనందించారు. కానీ వరుసగా కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఒక అపురూప సన్నివేశపు అంచున నిలబడి ఉన్నారని భావించాలి.

నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ కొడతారా? కాషాయ యుగపు పాంచజన్యం పూరిస్తారా? ఈ లక్ష్యసాధనకు గల అవకాశా లేమిటి? అడ్డంకులేమిటి? అనే విషయాలపై మేధోమథనం జరి గిన తర్వాతనే జంబో కేబినెట్‌ రంగప్రవేశం చేసిందనే అభి ప్రాయం కలుగుతున్నది. రాజకీయంగా చూస్తే ఇప్పటికీ మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. రెండేళ్ల కిందటితో పోలిస్తే రేటింగ్‌ కొంత తగ్గినప్పటికీ మోదీయే అగ్ర స్థానంలో కొనసాగుతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆయ నకు దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేడు. అయితే పరిపాలనాపరంగా ఆయన ప్రభుత్వానికి పడుతున్న మార్కు లెన్ని?. ప్రజల ఆర్థిక - ఆయురారోగ్య పరిస్థితులెట్లా వున్నాయి? రక్షణ-విదేశాంగ విధానాలు దేశ ప్రతిష్ట ఇనుమడించేవిధంగా ఉన్నాయా? ఉద్యోగ ఉపాధి రంగాలు యువతరంగాలతో జత గూడుతున్నాయా? వ్యవసాయం, పరిశ్రమలూ లాభదాయకం గానే ఉన్నాయా? ... ఇత్యాది అంశాలపై అలుముకునే ప్రజాభి ప్రాయమే మోదీ పాలనపై రేపటి తీర్పునకు కీలకం.

ప్రజాభిప్రాయం ఎట్లా ఏర్పడుతుంది? ఒకటి ప్రత్యక్ష అనుభవం, రెండోది పరోక్షంగా కలిగే అనుభూతి. కరోనా పీక్‌ టైమ్‌లో ఇంటిల్లిపాదికీ సోకిందనుకోండి. ఒకరికో ఇద్దరికో సీరి యస్‌ అయింది. ఆస్పత్రిలో బెడ్‌ ఆలస్యంగా దొరికింది. ఆక్సిజన్‌ సిలిండర్‌ దొరకలేదు. ఒకరు చనిపోయారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆ కుటుంబ సభ్యులు అనుభవపూర్వకంగా చెబు తారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సరిగ్గా పనిచేయ లేదు. ఇటువంటి అలక్ష్యాన్ని మోదీ అస్సలు సహించరు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను పీకిపారేశారు. ఇది అనుభూతి. అనుభవం వ్యక్తిగతం. ఇది కూడిక లెక్కలతో పెరుగుతుంది. అనుభూతి సామూహికం. ఇది హెచ్చవేతలతో పెరుగుతుంది. కనుక చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాల (experiences ) కంటే సామూహిక అనుభూతి (perception)ది పైచేయి అవు తుంది. ‘హర్‌ దర్ద్‌కో ఏకీ దవా (సర్వరోగనివారిణి) జిందా తిలి స్మాత్‌’ అనే మాటను పూర్వకాలం నుంచీ వింటున్నాము. ఆ మందును ఎప్పుడూ వాడకపోయినా, ఆ నినాదాన్నయితే నమ్ముతాము. అదీ అనుభూతి. మోదీ సర్కార్‌ పాలనలో ప్రజల వ్యక్తిగత దైనందిన జీవితానుభవాలు ఎట్లా ఉన్నా... సామూహి కంగా ఒక పాజిటివ్‌ అనుభూతిని ఉత్పత్తి చేయడం సంఘ్‌ పరివార్‌ మేథోవర్గం ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ కార్యక్రమంలో తొలిదశ మొన్న జంబో కేబినెట్‌ ఏర్పాటుతో పూర్తవుతుంది.

కేబినెట్‌ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో రవిశంకర్‌ ప్రసాద్, ప్రకాశ్‌ జవదేకర్, రమేశ్‌ పోఖ్రియాల్, డాక్టర్‌ హర్ష వర్ధన్, సదానందగౌడ వంటి సీనియర్లు ఉండటం కొంత ఆశ్చ ర్యాన్ని కలిగించింది. కీలక శాఖల్లోని వైఫల్యాలకు కొందరు వ్యక్తులను బాధ్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నదనే అభిప్రాయం విన బడుతున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత గతంలో వాజ్‌ పేయి ప్రభుత్వంలో పనిచేసిన వారిలో రాజ్‌నాథ్, నఖ్వీ ఇద్దరే మిగిలారు. ఇది వాజ్‌పేయి నీడ కూడా లేని అచ్చమైన మోదీ కేబినెట్‌.

వైఫల్యాలను కడిగేసుకోవడంతోపాటు సామాజిక మార్పు సంకేతాలను కూడా ఈ పునర్వ్యవస్థీకరణ బలంగా ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలిరోజుల్లో ‘జనసంఘ్‌’గా ఉన్న ప్పుడు దానిపై బ్రాహ్మణ్‌-బనియా (వైశ్య) ముద్ర ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విలీనం కావడం, అందులో చేరిన నానాజాతి సభ్యుల్లోని తటస్థ వర్గాలను తన గూటికి ఆకర్షించి బీజేపీ పేరుతో పునరుత్థానమవడం వెనుక వాజ్‌పేయి, అడ్వాణీల వ్యూహరచనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ వ్యూహం ఆరెస్సెస్‌ ఆలోచన కూడా కావచ్చు. అనంతర కాలంలో రామ మందిర ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోని వెనుకబడిన వర్గాలనూ, గిరిజనులను పెద్దఎత్తున బీజేపీ సమీకరించుకోగలిగింది. పార్టీ సామాజిక పొందికను విస్తృతం చేసే పనిని మోదీ మరింత వేగవంతం చేశారు. ప్రధానితో సహా 78 మంది సభ్యులున్న మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంఖ్య 52. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఎక్కువమంది బలహీనవర్గాల ప్రతినిధులున్న కేంద్ర మంత్రి వర్గం ఇదే కావచ్చు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయా వర్గాల పాజిటివ్‌ అనుభూతిని మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నదని చెప్ప వచ్చు. కేంద్ర మంత్రిమండళ్లలో సహాయ మంత్రుల పాత్ర నామమాత్రం. అధికారాన్ని చలాయించే కేబినెట్‌ మంత్రులు ఇప్పుడు ప్రధానితో కలిపి 31 మంది ఉన్నారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిపితే 11 మంది. ఇరవైమంది హిందూ అగ్రవర్ణాల వారు. వారిలో ఆరుగురు బ్రాహ్మణులు. ఐదుగురు రాజ్‌పుత్‌లు. ఇద్దరు బనియాలు, ఇద్దరు పాటీదార్లు (పటేల్‌), ఒకరు రెడ్డి. ఒకరు భూమిహార్, ఒకరు మల్హోత్రా.

వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కేబినెట్‌ కూర్పును ఖరారు చేసినట్టు స్పష్టంగా కనిపి స్తున్నది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎక్కువ లోక్‌సభ సీట్లున్న యూపీ నుంచి ఏడుగురిని కొత్తగా తీసుకున్నారు. వీరిలో ఎక్కు వమంది యాదవేతర బీసీలు. ఇక్కడ బీజేపీకి ప్రధాన పోటీ దారు అఖిలేశ్‌ సింగ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ. ఈ పార్టీ నుంచి నాన్‌-యాదవ్‌ బీసీలను దూరం చేయడం ద్వారా యాదవ-ముస్లిం వర్గాలకే సమాజ్‌వాది పార్టీని పరి మితం చేసే లక్ష్యం ఈ వ్యూహంలో కనిపిస్తున్నది. యాదవుల తర్వాత ప్రధాన బీసీ కులమైన కుర్మీ వర్గానికి చెందిన అనుప్రియా పటేల్‌ (అప్నాదళ్‌)కు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవీయోగం పట్టింది. ఉత్తరాఖండ్‌పై పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు. ఐదు ఎంపీ సీట్లున్న చిన్న రాష్ట్రం అది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్‌ గెలిస్తే మరోసారి బీజేపీ గెలవడం ఆనవాయితీ. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.

గుజరాత్‌ గెలుపు పట్ల బీజేపీలో పెద్దగా అనుమానాల్లేవు. ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకునే జనం ఓట్లేస్తారని ఆ పార్టీ విశ్వాసం. అయినా ఛాన్స్‌ తీసుకోకుండా రాష్ట్రంలో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న పాటీదార్ల (పటేళ్లు)కు రెండు కేబినెట్‌ బెర్తులు కేటాయించారు. పంజాబ్‌ను అంతగా పట్టించుకోలేదు. రైతుల ఆందోళన తర్వాత పంజాబ్‌ మీద బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకున్నది. పంజాబ్‌ నుంచి ఒక్క జాట్‌ సిక్కుకూ స్థానం దొరకని మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి ఇదే. ఈ రాష్ట్రానికి చెందిన హర్‌దీప్‌సింగ్‌ పూరీ అనే ఖత్రీ కులానికి చెందిన సిక్కు కేబినెట్‌లో ఉన్నారు. రాష్ట్రంలో జాట్‌ సిక్కుల జనాభా 30 శాతం దాకా ఉంటుంది. దళితుల జనాభా మరో 30 శాతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ, లెఫ్ట్, బీఎస్పీలతో కూడిన అకాలీదళ్‌ కూటమికీ మధ్యనే ప్రధానంగా పోటీ జరగబోతున్నది. పటియాలా రాజవంశస్థు డైన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయం ఉన్నది.
 
యువకులు, విద్యావంతుల అనుభూతిని కూడా ప్రభా వితం చేసే అంశాలకు కేబినెట్‌ పొందికలో వీలు కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58కి తగ్గింది. రాజకీయ రంగంలో ఇది యూత్‌ కిందే లెక్క. అట్లాగే మాజీ ఐఏఎస్‌ అధికారులకు, టెక్నోక్రాట్లకు, డాక్టర్లకు, లాయర్లకు అవకాశం లభించింది. అశ్వినీ కుమార్‌ వైష్ణవ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. ఆయనకిప్పుడు కేబినెట్‌ హోదా వచ్చింది. వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. కాన్పూర్‌ ఐఐటీలో ఎమ్‌టెక్‌ చేశారు. అక్కడ ఆయన స్పెషలైజేషన్‌ పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ మీద. ఆయనకిప్పుడు రైల్వే శాఖ లభించడం వెనుక లక్ష్యం సుస్పష్టమే. భారతీయ రైల్వేలు ఇక పీపీపీ పట్టాలెక్కబోతు న్నాయి. మరో ఐఏఎస్‌ అధికారి రాజ్‌కుమార్‌సింగ్‌కు ప్రమోషన్‌ లభించి కేబినెట్‌ మంత్రయ్యారు. బీజేపీ ప్రజా పునాదులను విస్తృతం చేసిన అడ్వాణీ రథయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్‌ కుమార్‌సింగ్‌ బిహార్‌ కో-ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న లాలూయాదవ్‌ జిల్లా కలెక్టర్‌కూ, ఎస్పీకి చెప్ప కుండా రాజ్‌కుమార్‌కు అదనపు మేజిస్ట్రేట్‌ హోదా కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలిచ్చి ఈయన ద్వారానే అడ్వాణీని అరెస్ట్‌ చేయిం చారని చెబుతారు. అడ్వాణీని అరెస్ట్‌ చేసిన అధికారి అదే బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి కావడం విధివిలాసమేమో!

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇలినాయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమ్‌టెక్‌ పట్టా పొందారు. ఆయనకిప్పుడు ఐటీ సహాయమంత్రి పదవి లభించింది. బీపీఎల్‌ టెలికామ్‌ కంపెనీని ఈయనే స్థాపించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాన్ని ఈయన పర్యవేక్షించనున్నారు. మంత్రిమండలిలో మహి ళల సంఖ్య కూడా 11కు పెరిగింది. అందుబాటులో ఉన్న వివ రాల మేరకు ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. మంత్రిమండలి కూర్పులోని సానుకూలాంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధిపొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పైపూతల వల్ల లోతైన గాయాలు (ఉంటే) ఏమేరకు మాను తాయో చూడాలి. కీలక మంత్రులను తప్పించినంత మాత్రాన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలగడం సాధ్యమేనా? ఈ అంశం మీద ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌ ఎమ్మెల్యే, యువ దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ ఒక ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు. ‘‘ఖరాబీ ఇంజిన్‌ మే హై, ఔర్‌ బద్లే డిబ్బే జారహే హై’’.  సమస్య ఇంజన్‌లో ఉంటే డబ్బాలను మారుస్తున్నారట. ఈ రైలు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మాత్రం జిగ్నేష్‌ చేసిన కామెంట్‌ తప్పవుతుంది. 

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు