‘ఆజాదీ’ అంతరంగం!

22 May, 2022 00:50 IST|Sakshi

జనతంత్రం

మన ‘ఆజాదీ’కి ఇది అమృతోత్సవ సంవత్సరం. స్వాతంత్య్రం సిద్ధించిన అమృత ఘడియల్లోనే హాలాహలం కూడా పుట్టింది. మన ప్రజాస్వామ్య పరమశివుడు దాన్ని తన కంఠంలో బంధించలేకపోయాడు. డెబ్బౖయెదేళ్లు గడిచినా ఆ విష ప్రభావం తగ్గలేదు. ఇంకా బొట్లుబొట్లుగా రాలుతూనే ఉన్నది. అమృతోత్సవాలు వర్షించవలసిన సమయంలో హాలహలపు జడివాన మొదలైంది. బాక్సింగ్‌ ప్రపంచకప్‌ బరిలో హైదరాబాద్‌ యువతి నిఖత్‌ జరీన్‌ మన జాతీయ పతకాన్ని సమున్నతంగా ఎగరేస్తున్న సమయానికి మన జాతీయ న్యూస్‌ చానళ్లన్నీ జ్ఞానవాపీ మసీదు – మందిర సమస్యలో మునిగి తేలుతున్నాయి. ఈ డిబేట్‌ ఫలితంగా దేశంలోని ఒక వర్గం మరింత అభద్రతా భావంలోకి జారుకుంటున్నది. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన జాఫర్‌ ఇక్బాల్‌ (హాకీ), అబ్దుల్‌ రహీమ్‌ (ఫుట్‌బాల్‌), అజారుద్దీన్‌ (క్రికెట్‌), సానియా మీర్జా (టెన్నిస్‌), అబ్దుల్‌ బాసిత్‌ (వాలీబాల్‌), నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌) వగైరాలు పుట్టిన వర్గం అది. 

అయోధ్య ధారావాహికకు కొనసాగింపే – జ్ఞానవాపీ మసీదు ఎపిసోడ్‌. అయోధ్య వివాదం నేపథ్యంలో మన దేశ పార్లమెంట్‌ ఒక చట్టాన్ని చేసింది. ‘ప్రార్థనా స్థలాల చట్టం – 1991’గా దాన్ని పిలుచుకుంటున్నాము. దేశంలో ఉన్న ఆరాధనా స్థలాల్లో 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఏ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయో ఇక ముందు కూడా అవే కొనసాగుతాయనీ ఆ చట్టం నిర్దేశించింది. చరిత్ర గమనంలో ఒక మతానికి చెందిన ప్రార్థనాలయాలను మరొక మతం వారు ధ్వంసం చేసి తమ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలుగా మార్చుకున్నారని కోకొల్లలుగా ఆరోపణ లున్నాయి. ఇటువంటి ఆరోపణలున్న ప్రతి ఆలయ స్వభావాన్ని ఇప్పుడు మార్చుకుంటూ పోతే ఇక దానికి అంతే ఉండదు. నిరంకుశ పరిపాలకులు రాజ్యమేలిన కాలంలో జరిపిన చర్యలకు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీకార చర్యలు అసమంజస మనే స్ఫూర్తితో 1991 చట్టాన్ని తయారు చేశారు. చట్టాల్లో లొసుగులు వెతకడం ఎంతసేపు? అయోధ్య పరిణామాలిచ్చిన ఊపుతో ఉన్న ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలకూ, హిందూ సంస్థలకూ ఈ చట్టం ఒక ప్రతిబంధకమనిపించలేదు. 1958 పురాతన కట్టడాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రదేశాలకు, అప్పటికే చర్చల ద్వారా పరిష్కారమైన ప్రదేశాలకు 1991 చట్టం మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపు ఆసరాతో హిందూ సంస్థలు కింది కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపి, అనుకూల తీర్పులు పొందగలుగుతున్నాయి. ఒక ప్రార్థనా స్థలపు మతస్వభావాన్ని నిర్ధారించే పరిశీలన 1991 చట్టం ప్రకారం కూడా నిషేధం కాదు కనుక కాశీలోని జ్ఞానవాపీ మసీదు సర్వే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హిందూ సంస్థలకు ఇదొక బూస్టర్‌‡డోస్‌.

జ్ఞానవాపీ సర్వేలో హిందూ ఆలయ ఆనవాళ్లు బయట పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మథురలోని ‘శ్రీకృష్ణ జన్మస్థానం – షాహీ ఈద్గా’ వివాదంపై విచారణకు కూడా జిల్లా కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని వెంటనే కుతుబ్‌ మినార్‌ కూడా లైన్లో ఉన్నదట! ఈ సర్వేల్లో కూడా వాటి పునాదుల్లో హిందూ ఆనవాళ్లు కనిపిస్తే కనిపించవచ్చు. మధ్యయుగాలనాటి ముస్లిం రాజుల పాలనలో, ముఖ్యంగా మొఘల్‌ కాలంలో వేలాది హిందూ దేవాలయాలను మసీదులుగా మార్పు చేశారని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలూ, హిందూ సంస్థలూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సంఖ్య అతిశయోక్తితో కూడినదని నిష్పాక్షిక పరిశోధకులు, పరిశీలకులు చెబుతున్నారు. అయితే సుమారు వంద వరకు ఆలయాలు ఈ కాలంలో మార్పులకు గురై ఉండవచ్చని కూడా అంగీకరిస్తున్నారు. మధ్యయుగానికి పూర్వం కూడా ఆరాధనా మందిరాలను ధ్వంసం చేసి మరో మతానికి చెందిన ఆలయాలుగా విస్తారంగా మార్పులు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రాచీన కాలంలో భరతఖండం నలుమూలలా బౌద్ధం పరిఢవిల్లిందని మనకు తెలుసు. ఆ కాలంలో వెలసిన వేలాది బౌద్ధారామాలు, చైత్యాలయాలు, విహారాలు, స్తూపాలను ధ్వంసం చేసి వాటి పునాదుల మీద హిందూ దేవాలయాలు నిర్మించారన్న ఆరోపణ లున్నాయి. ప్రసిద్ధికెక్కిన పూరీ, పండరీపూర్, తిరుపతి ఆలయాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పూరీ, ఖజురహో పునాదుల్లో బౌద్ధ చైత్యాలయాలున్నాయని పురాతత్వ వేత్తలు కూడా విశ్వసిస్తున్నారు.

గుప్త వంశ రాజులు పాలిస్తున్న ఐదో శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు ఫాహియాన్‌ ఈ పరిణామాలకు ఒక సాక్షి. గౌతమ బుద్ధుడు కొంతకాలం నివసించిన శ్రావస్తిలో కూడా కుషానుల కాలం నాటి బౌద్ధారామాన్ని మార్చి హిందూ ఆలయంగా నిర్మించారని ఆయన రాశారు. ఏడో శతాబ్దంలో భారత యాత్ర చేసిన బౌద్ధ యాత్రికుడు సూన్‌ సాంగ్‌ ఈ విధ్వంసాన్ని మరింత వివరంగా గ్రంథస్థం చేశాడు. బుద్ధుడు మోక్ష జ్ఞానం పొందిన సమయంలో ఆయనకు నీడనిచ్చిన బోధి వృక్షాన్ని గౌడ శశాంకుడు నరికించాడనీ, ఆ కాలంలో వందలాది బౌద్ధారామాలను ధ్వంసం చేశారనీ సూన్‌సాంగ్‌ పేర్కొన్నాడు. ఈ ప్రదేశాలన్నింటి మీద కూడా ఇప్పుడు సర్వే జరగాలని కోరడం ఏ మేరకు సమంజసమవుతుంది? అట్లాగే మధ్య యుగాలనాటి మార్పులపైనే అధ్యయనం చేసి, ప్రాచీన చరిత్రలోని మార్పు లను వదిలేయాలనడం మాత్రం ఎంతమేరకు హేతు బద్ధమవుతుంది? కనుక 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్నీ, దాని వెనుకనున్న స్ఫూర్తినీ యథాతథంగా గౌరవించడమేమన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి దోహదపడు తుందని భావించాలి.

ఆలయాల పునరుద్ధరణ డిమాండ్‌ ఒక మతపరమైన వ్యవహారంగానే మిగిలిపోతే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ అదొక రాజకీయ ఎజెండాగా, బలమైన రాజకీయ శక్తుల చేతిలో ఆయుధంగా మారడం మాత్రం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన అంశమే. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవలసినంత అవసరం, అగత్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలక బీజేపీకి ఉన్నదా? అసలట్లా వాడుకోవడం సరైనదేనా అనే ప్రశ్నను కాస్సేపు పక్కన పెడదాం. బీజేపీ రామబాణాన్ని ప్రయోగించకపోయినా దానితో పోరాడగల శక్తి ప్రధాన ప్రతిపక్షానికుంటుందని ఈ దేశంలో ఎవరూ భావించడం లేదు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఒక విఫల ప్రయోగం గానే మిగిలిపోయే సూచనలు ఇంకా కనబడుతున్నాయి. తాను నాయకత్వం స్వీకరించడు. ఇంకొకరికి అప్పగించడు. బరువు తాను మోయడు, మరొకరిని నమ్మడు. ఇటువంటి బాధ్యతా రాహిత్యాన్ని దేశ ప్రజలు హర్షించలేరు. ఈ కారణం వల్లనే ప్రధాని అభ్యర్థి రేటింగ్స్‌లో నరేంద్ర మోదీ సమీపంలోకి కూడా రాహుల్‌ రాలేకపోతున్నారు.

మసీదులను మార్చే కార్యక్రమం ఒక్కటే కాదు, ముస్లిం మత ఆచార వ్యవహారాలపై కూడా దాడి జరుగుతున్నది. వారి ఇళ్ళ మీదకు బుల్డోజర్లు దండెత్తుతున్నాయి. అలహాబాద్‌ పేరు మారిపోయింది. లక్నవూ ఇక లక్ష్మణపురం కాబోతున్నదట. యువతుల వస్త్రధారణ మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. వీధి వ్యాపారుల దగ్గర పండ్లు, కూరగాయలు, మాంసం వగైరా కొనుగోలు చేయొద్దని కర్ణాటకలో పిలుపును కూడా ఇచ్చారు. ‘లవ్‌ జీహాద్‌’ వంటి పదజాలం వాడుక పెరిగింది. దేశంలో ఎనభై శాతం జనాభా ఉన్న వర్గానికి కేవలం 15 శాతం మాత్రమే ఉన్న ప్రధాన మైనారిటీని ఒక బూచిగా చూపించవలసిన అవసరం నిజంగా ఉన్నదా? వారిని బూచిగా చూపెడితేనే ఓట్లు రాలతాయా? ఈ దేశ ప్రగతికి ఆ పదిహేను శాతం జనాభా ఆటంకంగా ఉన్నదా?... ఇటువంటి ప్రశ్నలు నిరర్థకమైనవి.

వరసగా రెండు ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లభించింది. నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ గెలుపు మీద కూడా పెద్దగా సందేహాలు లేవు. తన కోర్‌ ఐడియాలజీని ఆచరణలో పెట్టేందుకు ఇదే అనువైన సమయమని సంఘ్‌ పరివార్‌ భావిస్తున్నదా? అందుకే హిందీ భాషను దేశం మొత్తం మీద రుద్దే ప్రయత్నాలను ప్రారం భించారా? హిందూ రాష్ట్రం దిశగా అడుగులు పడుతున్నాయా? ఫెడరల్‌ వ్యవస్థ స్థానే యూనిటరీ రాజకీయ వ్యవస్థను నిర్మించే ఆలోచనలు చేస్తున్నారా? రాష్ట్ర్రాల అధికారాలపై వేస్తున్న కత్తెర అందులో భాగమేనా? ఇటువంటి భయ సందేహాలు ప్రతి పక్షాల్లో వ్యక్తమవుతున్నాయి.

సంపూర్ణ స్థాయిలో అధికారం దక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన ఎజెండాను అమలుచేయడానికే ప్రయత్ని స్తుంది. అది రహస్య ఎజెండా అయినా సరే! ఎందుకంటే అదే దాని లక్ష్యం, గమ్యం కనుక! ఇప్పుడు బీజేపీ ఆ పరిస్థితిలో ఉన్నది. అయితే ఈ ఎజెండా అమలుచేయడం వలన మన దేశం బలపడుతుందా? బలహీనపడుతుందా అనేది చర్చించవలసిన అంశం. మతాల పేరుతో, కులాల పేరుతో విడిపోయిన సమాజం కంటే, సమతా ధర్మంపై ఏకోన్ముఖమైన సమాజమే ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. సామాజిక విభజన వల్ల ఇప్పటికే భారతదేశం భారీ మూల్యం చెల్లించింది.

గణితం, భౌతికశాస్త్రం, వైద్యం – ఇత్యాది విజ్ఞాన రంగాల్లో ఐరోపా వికసించడానికి వెయ్యేళ్ల ముందుగానే భారతదేశంలో విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగాయి. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కణాదుడు, వరాహమిహిరుడు, ఆచార్య నాగార్జున, సుశ్రుతుడు, చరకుడు మొదలైన వాళ్లంతా గెలీలియో, న్యూటన్, కెప్లర్, మేడమ్‌ క్యూరీ, డార్విన్, కోపర్నికస్‌ వగైరాలకు తాతల ముత్తాతల తాతల వంటివారు. కానీ మనది నిచ్చెనమెట్ల సామాజిక విభజన కనుక విజ్ఞానం కింది మెట్లకు చేరలేదు. విభజిత సమాజం కనుక ఏకోన్ముఖమై విదేశీ దాడులను ఎదుర్కొనలేదు. ఫలితంగా పరాధీనమైంది. సమాజం ఒక్కటిగా ఉన్నట్లయితే, విజ్ఞానం అన్ని వర్గాల్లోకి ప్రసరించి ఉన్నట్లయితే – ఐరోపా కంటే వందేళ్లో... అంతకంటే ముందుగానో భారతదేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఒకటి బలంగా ఉన్నది. అదే జరిగి ఉన్నట్లయితే ఈనాడు సకల సంపదలతో తులతూగే అగ్రరాజ్యంగా భారత్‌ నిలబడి ఉండేది. దేశభక్తి, జాతీయత అనే పదాలు తమ పేటెంట్లుగా భావించే బీజేపీ పెద్దలు గడిచిన చరిత్ర నుంచి పాఠాలు నేర్వాలి. కులాల పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేమన్నారు డాక్టర్‌ అంబేడ్కర్‌. విద్యాకుసుమాలు అన్ని కులాల్లో వికసించినప్పుడే పటిష్ఠమెన జాతి నిర్మాణం జరుగుతుంది. మతాల పేరుతో విడిపోయిన దేశం అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధిని విస్మరించే దేశభక్తి అసలు దేశభక్తే కాదు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు