ఈ నరమేధం ఆగాలి!

9 Nov, 2023 00:01 IST|Sakshi
ఇజ్రాయెల్‌ దాడుల్లో ధ్వంసమైన మఘాజి శరణార్థి శిబిరం శిథిలాల్లో బాధితుల కోసం పాలస్తీనియన్ల అన్వేషణ

నెల దాటిపోయినా, పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడి వ్యవహారానికి ముగింపు కనిపించడం లేదు. గాజా భూఖండంపై భూతల దాడిని ఇజ్రాయెల్‌ ముమ్మరం చేయడంతో మారణహోమం ముమ్మరమవుతోంది. ఆ ప్రాంతమంతటినీ నిర్జనవాసంగా మార్చేంత వరకు నెతన్యాహూ నిద్ర పోయేలా లేరు. పైపెచ్చు, గాజా ప్రాంతపు భద్రత బాధ్యత ఇకపై తమదేనంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని సోమవారం మరో బాంబు పేల్చారు.

దాని భావమేమిటో ఆయన విడమరిచి చెప్పనప్పటికీ, గాజాను తన హస్తాల్లో బిగించనున్నట్టు అర్థమవుతూనే ఉంది. గాజాను పునరాక్రమించుకోవడం, లేదంటే కనీసం 2005 సెప్టెంబర్‌ ముందు లాగా గాజా అంతటా తమ సైన్యమే ఉండేలా చూసు కోవడం ఇజ్రాయెల్‌ మనసులో మాటగా కనిపిస్తోంది. అదేమీ లేదని నెతన్యాహూ సహచరులు పైకి చెబుతున్నా, ఆ మాటలను నమ్మడం కష్టమే.  

సాక్షాత్తూ అమెరికా సైతం తనతో సహా పశ్చిమ దేశాలన్నీ తీవ్రవాద సంస్థగా భావిస్తున్న హమాస్‌తో రేపెప్పుడో యుద్ధం ముగిశాక గాజాను ఇజ్రాయెల్‌ పునరాక్రమించుకోరాదంటూ బుధవారం హెచ్చరించాల్సి వచ్చింది. అదే సమయంలో గాజాలో హమాస్‌ పాలన కొనసాగరాదనీ, అదే జరిగితే మళ్ళీ మొన్న అక్టోబర్‌ 7 తరహా దాడులు పునరావృతం కావచ్చనీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సన్నాయినొక్కు నొక్కారు.

గాజా దిగ్బంధనం, భూభాగాన్ని తగ్గించడం, బలవంతాన జనాన్ని ఖాళీ చేయించడం లాంటివేమీ చేయరాదనీ, వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనియన్‌ అథారిటీ పాలన సాగించాలనీ అన్నారు. హమాస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని పైకి చెబు తున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్న ధోరణి చూస్తే అలా అనిపించడం లేదు. 

సరిహద్దులు దాటి హమాస్‌ చేసిన అక్టోబర్‌ 7 నాటి దాడిలో ఇజ్రాయెల్‌లో 1400 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది దాకా బందీలయ్యారు. ఇజ్రాయెల్‌ నెల రోజుల పైగా సాగిస్తున్న ప్రతీకార దాడిలో ఇప్పటికి 11 వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారని లెక్క. దాడికి ప్రతిదాడిగా మొదలై, తీవ్రవాదం పేరు చెప్పి, అమాయక ప్రజలు సహా అందరినీ కబళిస్తున్న యుద్ధం ఆందోళన కలిగిస్తోంది.

పొరుగున ఉన్న భూఖండంలో నరమానవుడు మిగలకుండా నేలమట్టం చేయాలన్న ఇజ్రాయెల్‌ దుందుడుకుతనం తీవ్రమైనది. ఇదే దూకుడు కొనసాగితే... అప్పుడిక పాలస్తీనా పక్షాన ఇరాన్‌ తదితర దేశాలు నేరుగా బరిలోకి దిగితే... పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

దేశదేశాల ప్రపంచ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో మెజారిటీ దేశాలు శాంతిస్థాపన వైపు మొగ్గి, యుద్ధ విరమణకు తీర్మానం చేయకపోలేదు. అయితే, ఆ శాంతి వచనాలను పట్టించుకున్న నాథుడు లేడు. ఆ తీర్మానాన్ని అమలు చేసేందుకు సమకట్టాల్సిన అగ్రదేశాల్లో అధికభాగం ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షం వెనుక పరోక్షంగానైనా నిలబడడం పెద్ద సమస్య.

ఐరాస ప్రధాన కార్య దర్శి ఆ మధ్య అన్నట్టు... ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి ఉన్నట్టుండి ఏ శూన్యం నుంచో జరగలేదు. అదే సమయంలో ఆయనే వ్యాఖ్యానించినట్టు... పాలస్తీనియన్లు కష్టాలు, కన్నీళ్ళకు పరిష్కారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన భయానక దాడి కూడా కాదు. నాణానికి ఉన్న ఈ రెండు వైపులనూ సమగ్రంగా చూడగలిగితేనే ప్రపంచ దేశాలు ఈ సంక్లిష్ట సమస్యకు సరైన జవాబు ఆలోచించగలవు. 

అసలు తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ బాధ్యత కూడా చాలానే ఉంది. అక్టోబర్‌ 7 హమాస్‌ దాడికి దారితీసిన ఇజ్రాయెల్‌ గూఢచర్య వైఫల్యానికీ, అసలు హమాస్‌ తీవ్రవాదం పెచ్చరిల్లడానికీ, నెల రోజులుగా పాలస్తీనా – ఇజ్రాయెల్‌లలో సాగుతున్న ప్రాణనష్టానికీ ఆయనే బాధ్యుడని సొంత పౌరులే తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్‌ రాజకీయాల్లోని అస్థిరత సైతం గడచిన కొన్ని వారాల పరిస్థితికి పాక్షికంగా కారణమే. వాటి నుంచి దృష్టి మరల్చ డానికే అన్నట్టుంది నెతన్యాహూ వ్యవహారం.

హమాస్‌కు అడ్డాలుగా మారాయంటూ, ఆయన ఆస్పత్రులపై బాంబులు వేయించారు. చివరకు నిరాశ్రయులైన పాలస్తీనీయులకు ఆశ్రయమిస్తున్న గాజాలోని అతి ప్రాచీన గ్రీకు ఆర్థొడాక్స్‌ చర్చినీ వదల్లేదు. గాజాలోని నివాస వసతుల్లో దాదాపు సగానికి పైగా దాడుల్లో నేలమట్టమైన పరిస్థితి. హమాస్‌ పేరిట సామాన్యులపై సాగుతున్న ఈ అసాధారణ యుద్ధ నేరంపై సహజంగానే నిరసన తలెత్తింది. ఇజ్రాయెల్‌ పక్షీయులతో సహా అన్ని దేశాలపై ఇప్పుడు తక్షణ కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. 

జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు తమ తాజా సమావేశంలో శాశ్వత యుద్ధ విరమణ ఊసెత్త కుండా, అమాయక పాలస్తీనా పౌరులకు సాయం అందించడానికి వీలుగా మానవతా దృక్పథంతో దాడులకు విరామాలు ఇవ్వాలని కోరారు. విస్తృత శాంతి ప్రక్రియకు పూనుకోవాలని మాత్రం అనVýæలిగారు. ఇవి కంటితుడుపు మాటలే.

గాజాలో నరమేధాన్ని మౌనంగా చూస్తున్న ప్రపంచ మానవాళి మొత్తం సమష్టి బాధ్యత వహించాల్సిందే. ఎవరి అంతరాత్మకు వారు జవాబు చెప్పుకోవా ల్సిందే. రోజూ 160 మంది పాలస్తీనా పసివాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఒక పోరులో పదుల సంఖ్యలో జర్నలిస్టులు అసువులు బాశారు. 

గాజాలో తిండి, నీరు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక విలపిస్తూ, ఆత్మీయుల మృతదేహాలను గుర్రపుబండ్లల్లో తీసుకెళుతున్న దృశ్యాల్ని చూసి మనసు కరగనివారు మనుషులు కారు. ఇది త్రాసులో తప్పొప్పుల లెక్కలు తేల్చే తరుణం కాదు. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల్నీ, అమాయకుల్నీ ఈ మతి లేని మహా విధ్వంసం నుంచి కాపాడాల్సిన సమయం. చిన్నారుల మరుభూమిగా మారు తున్న గాజా మరింత విధ్వంసంలోకి జారిపోక ముందే యుద్ధానికి తెర దించడం అత్యవసరం. 

మరిన్ని వార్తలు