Divorce Rates Increasing In India: భార్యాభర్తల మధ్య పెరిగిపోతున్న విడాకుల కల్చర్‌.. పిల్లలపై తీవ్ర ప్రభావం

19 Aug, 2023 11:50 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి: వందేళ్లు కలసి బతకాల్సిన వారు చిన్నపాటి కారణాలతో విడిపోతున్నారు. పెళ్లయిన ఆరు రోజుల నుంచి ఆర్నెల్లు గడవకముందే భాగస్వామి అర్ధం కావడం లేదనో, అర్ధం చేసుకోవడం లేదనో విడిపోవాలనుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండే బలమైన బంధమే దాంపత్య జీవితం అని గుర్తించలేకపోతున్నారు.

ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకోకుండా తమ ఆలోచనల్ని గౌరవించడం లేదంటూ వేదనకు గురవుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా రెండు కుటుంబాల్లో మనస్పర్థలు వస్తున్నాయి. సర్దుకుపోతే ఎలాంటి సమస్య ఉండదని తెలిసినా.. విడాకుల వరకూ వెళ్తున్నారు.

● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్‌కు చెందిన 24 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో గతేడాది వివాహమైంది. నెల రోజుల వ్యవధిలోనే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పోలీస్‌ మెట్లు ఎక్కారు. ఇప్పటి వరకూ సమస్య తెగలేదు. పెద్ద మనుషుల సమక్షంలో సర్దిజెప్పినా వినలేదు. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

● జగరాజుపల్లికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఆరేళ్లుగా పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విడాకులు తీసుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో కలిసి జీవిస్తామని వెళ్లినా తిరిగి వారం రోజులకే విడిపోయారు. వారి మధ్యలో ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారు.

● గోరంట్లకు చెందిన డిప్లొమా విద్యార్థికి బాగేపల్లికి చెందిన మెకానిక్‌తో ఏడాది క్రితం వివాహమైంది. మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అమ్మాయి పుట్టింటికి చేరింది. సర్దిజెప్పినా వినలేదు. తర్వాత అమ్మాయి ఇంటికే అబ్బాయి వచ్చాడు. నెల రోజుల తర్వాత పంచాయితీ మొదటికొచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. దంపతుల మధ్య సమస్య కారణంగా ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది.


అహమే కారణమా?

ఏడడుగులు నడిచి ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులను పోషించకపోవడం.. మరికొందరు తాగుడుకు బానిసై కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మనుషుల మధ్య అహంతోనే ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి రచ్చకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు స్పందన కార్యక్రమంలో భార్యభర్తల కేసులు పెరిగిపోతున్నాయి. వచ్చే పిటిషన్లలో మూడింట రెండోవంతు ఉంటున్నాయి.


ఆధిపత్య ధోరణితోనే సమస్యలు

కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. బండికి రెండు చక్రాలు సమానంగా.. సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే ధోరణి ప్రదర్శిస్తుండటంతో గొడవలు పెరుగుతున్నాయి. తాము చెప్పిందే భార్య వినాలని కొంతమంది భర్తలు, తాను చెప్పినట్లే చేయాలని భార్యలు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఆమె మాటను ఆయన గౌరవించకపోవడం, ఆయనకు ఆమె విలువ ఇవ్వకపోవడంతోనే కాపురంలో కలతలు పెరుగుతున్నాయి.

మొండి వైఖరి.. క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు

దంపతులు మొండి వైఖరి వీడి సామరస్యంగా మాట్లాడుకుంటే నాలుగు గోడల మధ్యనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే ధోరణి మానేయాలి. జీతాలు, హోదాలు ఎన్ని ఉన్నా కుటుంబం ముఖ్యమనే భావనతో మెలగాలి. దంపతుల మధ్య తగాదా వస్తే మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పెవరిదో తెలిస్తే క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలు అనాథలుగా మారుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా అవగాహనతో ముందుకెళ్తే మంచిది.

ఎస్‌వీ మాధవ్‌రెడ్డి, ఎస్పీ

మరిన్ని వార్తలు