97 డిపోలకు గాను 96 లాభాల్లో.. 

20 Dec, 2023 02:17 IST|Sakshi

గత సోమవారం నాటి ఆదాయంపై లెక్కలేసిన ఆర్టీసీ 

సీఎం రేవంత్‌ సొంత నియోజకవర్గంలోని కోస్గి డిపో ఒక్కటే నష్టాల్లో 

‘మహాలక్ష్మి’తో ఒక్కరోజులో ఆర్టీసీకి రూ.21.11 కోట్ల ఆదాయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు పెరగడంతో దశాబ్దం తర్వాత సంస్థ లాభాలను ఆర్జిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలి్పంచడంతో, వారి రూపంలో కోల్పోయే మొత్తాన్ని ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్‌ చేస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లెక్కలు ఖరారు చేశారు. గత సోమవారం (డిసెంబర్‌ 18) ఒక్కరోజే రూ.21.11 కోట్ల ఆదాయం నమోదైంది.

ఈనెలలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే, సోమవారం ఏకంగా 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలో ఉన్న కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం చవిచూసింది. ఇలా 96 డిపోలు లాభాల్లోకి రావటం టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఆల్‌టైం రికార్డుగా నిలిచింది.

డిసెంబరులో ఇప్పటివరకు 49 డిపోలు లాభాలు ఆర్జించాయి. దీంతో ఈనెల మొత్తానికి రూ.3.14 కోట్ల లాభం నమోదవుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలా ఒక నెల మొత్తానికి లాభాలు నమోదవడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. బస్సుల్లో సాధారణ రోజుల్లో కంటే సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. జీరో టికెట్ల జారీ మొదలైన తర్వాత తొలి సోమవారం (18వ తేదీ) 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు తేలింది. సోమవారం 30.12 లక్షల జీరో టికెట్లు (మహిళలకు ఇచ్చేవి) జారీ అయ్యాయి.  

కొత్త ఉత్సాహం 
కొన్ని డిపోలు సోమవారం ఒక్కరోజే 14 లక్షలకు మించి లాభాలు ఆర్జించటం విశేషం. ఒక్కో డిపో రోజుకు ఐదారు లక్షల నష్టాలను చవిచూసే పరిస్థితికి అలవాటుపడ్డ ఆర్టీసీకి తాజా లెక్కలు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం హనుమ కొండ డిపో రూ.14.10 లక్షలు, దేవరకొండ డిపో రూ.13.94 లక్షలు, మహబూబ్‌నగర్‌ డిపో రూ. 13.61 లక్షలు, హైదరాబాద్‌–1 డిపో రూ. 13.55 లక్షలు.. ఇలా పలు డిపోలు భారీ లాభాలు నమో దు చేసుకున్నాయి. ఒక్క కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం పొందటంతో మొత్తం డిపోల జాబితాలో నష్టాలు పొందిన ఏకైక డిపోగా మిగిలింది.  

450కు మించి టికెట్ల జారీ 
సాధారణంగా జిల్లా సర్విసుల్లో ఒక కండక్టర్‌ గరిష్టంగా 300 వరకు టికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వాటిల్లో 450కి మించి టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది. మహిళలకు జీరో టికెట్‌ జారీ చేస్తున్నా.. వారు ఎక్కడి వరకు ప్రయాణిస్తారో తెలుసుకోవడం, వారు తెలంగాణ నివాసితులా కాదా అని ధ్రువపత్రాలు పరిశీలించడం లాంటి వాటి వల్ల టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు