పరిణతి... జీవన సాఫల్యం

19 Sep, 2022 00:24 IST|Sakshi

బాల్యదశ తరువాత మనలో శారీరకంగా వచ్చే మార్పు, ఎదుగుదలే పరిణతి. ఇది భౌతికమైనదే కాదు, మానసికమైనదీ కూడ. మన ఆలోచనలలో, ఆలోచనా రీతిలో వచ్చిన, వస్తున్న తేడాను చూపుతుంది. అంటే మన మనోవికాసాన్ని, దాని స్థాయిని సూచిస్తుంది. మనం వయసు రీత్యా ఎదిగే క్రమంలో మన భాషలో, అభివ్యక్తిలో, ఎదుటివారిని అర్ధం చేసుకునే తీరులో, మన స్పందనలో వెరసి మన ప్రవర్తనలో వచ్చే క్రమానుగతమైన మార్పే పరిణతి. కొంతమందిలో వారి శారీరక వయసు కన్నా పరిణతి వయసు ఎక్కువ. మరికొందరిలో దీనికి భిన్నమూ కావచ్చు. వయసులో పెద్దవారైనా తగిన పరిణతి లేకపోవచ్చు. అలాగే వయసులో చాలా చిన్నవారైనా కొంతమందిలో ఎంతో మానసిక పరిణతి కనిపిస్తుంటుంది. కాబట్టి మన వయసు మన మానసిక ఎదుగుదలకు దర్పణం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్లనే పరిణతికి వయసు లేదని, వయసు రీత్యా నిర్ధారించలేమని విజ్ఞులు చెపుతారు.

పరిణతికి ఛాయార్థాలు చాలా ఉన్నా పరిపక్వత అన్న అర్థంలో ఎక్కువగా వాడతారు. ప్రవర్తన గురించి చెప్పటానికి తరచూ వాడే మాట. పరిణతి అన్న నాలుగు అక్షరాలలో ఎంతో విశేషమైన, లోతైన, విస్తృతార్థముంది. పరిణతంటే సంక్షిప్తంగా చెప్పాలంటే భావోద్వేగాల మీద గట్టి పట్టు, నియంత్రణే పరిణతి. విచక్షణ, వివేచన, సంయమనం, సహనం, క్షమాగుణం, ఉచిత సంభాషాణ తీరు, దూరదృష్టి, విభేదాలు మరచి అందరిని కలుపుకుని ముందుకు సాగే వైఖరి. ఇక్కడ ఉదాహరించినవి కొన్నే అయినా ఈ పరిణతి ఇంకా ఎన్నో లక్షణాలను దానిలో పొదవుకుంది.

మన పుట్టుకకు లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ ఇతరులను కలుపుకుని మనలోని మానవీయ శక్తులను బలపరచుకుంటూ ముందుకుసాగాలి. అదే జీవిత సార్థకత. ఉత్తమమైన, ఉన్నతమైన పథంలో పయనించగలగాలి. అప్పుడే కదా మానవులు బుద్ధిజీవులన్న మాటకు మరింత ఊతాన్నిచ్చినట్టు! ఇది మనసు లో నిలుపుకుని మానవుడే మహనీయుడు అన్న మాటను సుసాధ్యం చేయాలనుకునే వారికి.. పరిణితి ఎందుకు సాధ్యం కాదు? అన్న ఆలోచన వస్తుంది. దీన్ని సాధించి తీరాలన్న పట్టుదల వస్తుంది. అటువంటి వారికి ఇంత గొప్ప పరిణితి సాధించటం అసాధ్యం కాదు. అంటే దీనర్థం పరిణతికున్న అర్ధ పార్శా్వలన్నిటిపై వారికి ఓ పట్టు వచ్చి వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది.

మన జీవనక్రమంలో అనేకమందితో కలసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం కొందరితో కొంతకాలం, మరికొందరితో జీవితాంతం సాగుతుంది. వీరందరితోనూ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి గొప్ప మానసిక పరిణతి కావాలి. ఇంతటి ఉన్నత పరిపక్వత సాధించే గలిగే వారు వేళ్ళమీద లెక్కించగల సంఖ్యలోనే ఉంటారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారే, ఆదర్శనీయులే, నమస్కరించ తగినవారే.

ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో మన దృష్టి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇక్కడ దృష్టి అంటే మన వైఖరి. సమగ్రమైన అవగావన రావాలంటే దానికి చుట్టుకొని ఉన్న అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అపుడే దానిమీద సాధికారంగా మాట్లాడగలం. ఈ దృష్టి, విశ్లేషణా శక్తి, అవగాహనా తీరునే పరిణతి అంటాం.
స్థాయిలో పరిణితి సాధ్యమా? అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితే కనక ఇది సాధ్యమే.. ఇది మన దృఢ నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ప్రయత్నించినా ఇది ఏ కొందరికో మాత్రమే పట్టుబడే శక్తి. ఈ పరిణితికి ఆవృతమైన అనేక లక్షణాలలో కొందరికి కొన్ని బాగా అలవడచ్చు. అందుకే దీనికి స్థాయీభేదం ఉంటుంది.
ప్రతి ఒక్కరి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనది. దీనికి అదే నిష్పత్తిలో మానసిక ఎదుగుదల ఉందా? మనలో ఎంతమంది వయసుకు తగిన విధంగా సమయోచితంగా ప్రవర్తిస్తున్నాం!? ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యత పరిణతే కదా!

మనం కొన్ని విషయాల్లో కొందరితో విభేదిస్తాం. అంతమాత్రాన బద్ధశత్రువులం కానవసరంలేదు. ఓ భావపరమైన, సిద్ధాంతపరమైన విషయాల వరకు మాత్రమే దానిని పరిమితి చేయాలి. అలాగే చంపదగ్గ శత్రువు మన చేత చిక్కినా వాడిని చంపకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టాలని వేమన చెప్పిన దానిలోనూ, మనకు అపకారం చేసిన వారికి కూడ వారి తప్పులను ఎంచకుండా ఉపకారం చేయాలని బద్దెన చెప్పిన దానిలో గోచరించేది పరిణతే. పరిణతి ఓ ధైర్యం. నిశ్చలత, స్థిత ప్రజ్ఞత.

చక్కని శ్రుతి లయలతో, ఆరోహణ అవరోహణలతో, భావయుక్తంగా అటు శాస్త్రీయత ఇటు మాధుర్యం రెండిటి సమాన నిష్పత్తిలో అద్భుతంగా సంగీతకచేరి చేస్తున్నాడో యువ సంగీత కళాకారుడు. ఆ రాగ జగత్తులో, ఆ భావనాజగత్తులో విహరిస్తూ తాదాత్మ్యతతో పాడుతున్న అతడి గానం పండిత, పామర రంజితంగా సాగింది. తన సంగీత ప్రవాహంలో ఊయలలూగించిన ఆ కళాకారుడు అంధుడు. కచేరి అనంతరం అతణ్ణి ఆ ఊళ్ళో అతనికి చిన్నప్పుడు సరళీ స్వరాలు నేర్పుతూ అసలు ఈ గుడ్డివాడికి ఆ విద్య అలవడనే అలవడదని తరిమేసిన అతని గురువు దగ్గరకు తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ఆ శిష్యుడు ఆయనకు పాదాభివందనం చేసి‘ఇదంతా మీరు పెట్టిన భిక్షే’ అని వినయంగా ఆయన పక్కన నిలబడ్డాడు. అంతే! ఆ గురువుకు తను చేసిన చర్య మనసులో కదిలి, సిగ్గుపడ్డాడు. అటు సంగీతంలోనే కాకుండా ప్రవర్తనలోనూ ఎంతో పరిణతి సాధించిన శిష్యుణ్ణి చూస్తూ ఆనందాశ్రువులు రాలుస్తూ మనసారా అతణ్ణి ఆశీర్వదించాడు. శారీరక వయసు కన్నా పరిణతి వయస్సు ఎక్కువని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ.

పరిణతి పొందటానికి అత్యంత అవసరమైనది అవేశాన్ని వీడటం. దానికి ఎంత దూరమైతే మానసిక పరిపక్వతకు అంత దగ్గరవుతాం. ఆవేశంలో ఆలోచనా శక్తిని కోల్పోతాం. వివేకం నశిస్తుంది. ఆ స్థితిలో మన మనసు తుఫానులో చిక్కుకున్న కల్లోలిత సంద్రమే. ఈ ఆవేశహంకారాలే విశ్వామిత్రుణ్ణి రాజర్షి స్థాయి నుండి మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి చేర్చటానికి అభేద్యమైన అవరోధమైంది. ఆయన జీవితంలో సింహభాగాన్ని ధార పోసేటట్టు చేసింది. 

– లలితా వాసంతి

మరిన్ని వార్తలు