పల్మనరీ మెడిసిన్‌ ఔట్‌

21 Aug, 2023 04:36 IST|Sakshi

మెడికల్‌ కాలేజీకి అవసరమైన విభాగాల నుంచి తొలగింపు 

జాతీయ మెడికల్‌ కమిషన్‌ తాజా మార్గదర్శకాలు 

ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్, రేడియేషన్‌ అంకాలజీలు కూడా ఔట్‌  

కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగం తప్పనిసరి 

ప్రత్యేకంగా యోగ విభాగం కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ సీట్లతో మెడికల్‌ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్‌ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్‌మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది.

అయితే ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్‌ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్, రేడియేషన్‌ అంకాలజీ విభాగాలను కూడా ఎన్‌ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. 

పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు 
ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్‌ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్‌ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తు­న్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. 

పల్మనరీ మెడిసిన్‌ రద్దు సమంజసం కాదు  
50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్‌ విభాగం తప్ప­నిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, సైంటిఫిక్‌ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ  

మరికొన్ని మార్గదర్శకాలు 

  •  అనెస్తీషియా కింద పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. 
  •  యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి.  
  •  గతంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు.  
  • స్కిల్‌ ల్యాబ్‌ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు.  
  •  గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు.  
  • ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. 
  • మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉండాలి. ఎంబీబీఎస్‌ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు.  
  •  గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్‌ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు.   
మరిన్ని వార్తలు