Anantapur : ఉద్యాన పంటల సాగులో అనంతపురం టాప్‌.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

17 Aug, 2023 11:41 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో ‘ఫల రాజసం’ అబ్బురపరుస్తోంది. అరుదైన పండ్లు, రుచికరమైన కూరగాయల ఉత్పత్తులకు కేరాఫ్‌గా నిలిచి రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లు నిగనిగలాడుతాయి. ఎర్రగా మెరిసే డ్రాగన్‌ పండ్లు ఆకర్షిస్తాయి. అంజూర్‌ పండ్ల రాశులు మురిపిస్తాయి. ఎరుపు – పసుపు వర్ణం కలగలసిన దానిమ్మ పండ్లు నోరూరిస్తాయి. అన్నిటికీ మించి అరబ్‌ షేక్‌లను సైతం ఆకట్టుకున్న గ్రాండ్‌ 9 అరటి గెలలు మైమరిపిస్తాయి.


ఖర్జూర ఫలాలను తెంపుతున్న మహిళా రైతు

32 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి..
రాష్ట్రంలో హార్టికల్చర్‌ హబ్‌ (ఉద్యాన పంటలకు కేంద్రం)గా అనంతపురం జిల్లా పేరుగాంచింది. చీనీ, అరటి తోటలు భూమికి ఆకుపచ్చటి రంగేసినట్టు కనిపిస్తుంటాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ తరహా పంటలు ఇప్పుడు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 32 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు, కూరగాయలు ఈ జిల్లా నుంచే ఉత్పత్తి అయ్యాయి. అందులో సింహభాగం ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే 10.85 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తవుతున్నాయి.

మన కూరగాయలు భలే రుచి గురూ..
జిల్లాలో పండించే కూరగాయలు రుచికి, నాణ్యతకు పేరెన్నికగన్నవి. టమాట, పచ్చిమిరప, బెండకాయలు, ఎండు మిర్చి, గోరు చిక్కుడు, అనప, వంకాయలు అద్భుతమైన రుచికి ఆలవాలం. పైగా స్థానికంగా పండించే ఈ కూరగాయలు ధరలోనూ అసాధారణమేమీ కాదు. సరసమైన ధరలకు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఉద్యాన పంటలన్నీ బోర్లకిందే ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా కరెంటు కోతలు లేకపోవడం, వర్షాలు సమృద్ధిగా పడటంతో మంచి ఫలసాయం రావడానికి కారణమైంది.

విదేశాలకు ఎగుమతి..
జిల్లాలో 1,27,599 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండిన అరటి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోట, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, మస్క్‌మొలన్‌ (ఢిల్లీ దోస), బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, బెండ, ఉల్లి పంట ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి అనుకూలమైన వాతావరణమే అనంతపురం జిల్లాలో పండ్ల తోటలకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ రైతులు కష్టపడే తత్వం ఎక్కువ. రాష్ట్రంలో అన్ని రకాల పండ్లను పండించే జిల్లాల్లో మొదటి స్థానం అనంతపురానిదే. ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా కూడా ఉంటాయి.


– రఘునాథరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌, హార్టికల్చర్‌

ఎకరాకు రూ.20 లక్షలు
మూడు ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంట పెట్టాను. తొలి ఏడాది ఎకరాకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి వస్తుంది. ఆ తర్వాత తగ్గుతుంది. కాపుకొచ్చాక ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోంది. మరో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పెట్టాను. ఆ పంట ఇంకా కాపునకు రాలేదు. మన నేలలు ఏ ఫలాలకై నా అనుకూలంగానే ఉంటాయి.


– కె.వి.రమణారెడ్డి, రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం

మరిన్ని వార్తలు